తమిళనాడులో ‘ఎస్‌ఐఆర్’పై సీఎం ఫైర్
Andhragazette - CM MK Stalin
CM MK Stalin: తమిళనాడులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)ను ఎన్నికల సంఘం (Election Commission of India) వచ్చే వారం ప్రారంభించనుంది. దీన్ని అధికార డీఎంకే పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ, అన్నాడీఎంకేపై ముఖ్యమంత్రి స్టాలిన్ విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు కలిసి ‘ఎస్‌ఐఆర్’ ద్వారా ప్రజల ఓటు హక్కును హరించి.. ఎన్నికల్లో గెలిచేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. డీఎంకే శ్రేణులను ఉద్దేశించి ఈ మేరకు ఓ లేఖ విడుదల చేశారు.
‘‘తమిళనాడులోనూ ఎన్నికల ప్రయోజనాల కోసం ‘ఎస్‌ఐఆర్’ నిర్వహణకు పావులు కదుపుతున్నారు. శ్రామికులు, ఎస్సీలు, మైనారిటీలు, మహిళల ఓట్లను తొలగించడం ద్వారా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవొచ్చని భాజపా, దాని మిత్రపక్షం అన్నాడీఎంకే భావిస్తున్నాయి. ఎన్నికల క్షేత్రంలో ప్రజలను ఎదుర్కొనే శక్తి లేనివారు, వారి ఓటు హక్కులను లాక్కొని విజయం సాధిస్తామని భావించేవారు.. తమిళనాడు విషయానికొస్తే మాత్రం బోల్తాపడతారు’’ అని సీఎం స్టాలిన్ (MK Stalin) పేర్కొన్నారు. అప్రజాస్వామిక చర్యలను ప్రజలతో కలిసి చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు.
అన్నాడీఎంకే చీఫ్, ప్రతిపక్ష నేత ఎడప్పాడి కె. పళనిస్వామిపైనా సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలోనూ.. ఆయన రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అండగా నిలిచే ప్రయత్నాలేమీ చేయడం లేదని విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో ఆయన చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలేనని ఖండించారు. అటువంటి వాటిని పట్టించుకోకుండా ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తూనే ఉంటామన్నారు.
తమిళనాడులో 50 నెమళ్లు మృతి
తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు చేసిన పనికి 50 నెమళ్లు మృతి చెందాయి. ఓ రైతు తన మొక్కజొన్న పంటను పక్షులు, జంతువుల నుంచి కాపాడేందుకు పొలం చుట్టూ ఆహార పదార్థాల్లో ఎలుకల మందుని కలిపి పెట్టారు. పొలం వద్దకు వచ్చిన నెమళ్ళు ఆ ఆహారం తిని మృత్యువాత పడ్డాయి. సుమారు 50 నెమళ్లు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలిని పరిశీలించి సదరు రైతుని అరెస్టు చేశారు. తెన్‌కాశీ జిల్లాలోని మీనాక్షిపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
