తుఫాను సన్నద్ధతపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష
Andhragazette - Kondapalli Srinivas
Minister Kondapalli Srinivas Review Meeting on Cyclone: మొంథా తుఫాను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తుఫాను కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. తుఫాన్ ను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై సమీక్షించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని రకాల ముందస్తు చర్యలను తీసుకోవాలని కోరారు. పంట నష్టం జరగకుండా రైతులకు తగిన జాగ్రత్తలను తెలియపరచాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే, వెంటనే పునరుద్ధరణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. త్రాగునీరు, పారిశుద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు.
కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో తుఫాన్ పై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

తుఫాను వల్ల జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంత్రికి వివరించారు. జిల్లాలో తుఫాను ప్రభావం పడే అవకాశం ఉన్న 69 గ్రామాలను ముందే గుర్తించామని, అక్కడి యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేశామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా 8 గ్రామ సచివాలయాల పరిధిలో ముందస్తు చర్యలను చేపట్టామని, పోలీసు సిబ్బందిని కూడా సిద్దంగా ఉంచామని చెప్పారు. పాఠశాలలు, తుఫాను భవనాలు తదితర 71 పునరావాస కేంద్రాలను సిద్దం చేశామని, ఆహార పదార్ధాలు, మందులు తదితర అత్యవసరమైన వాటిని సిద్దంగా ఉంచామని తెలిపారు. వాగులు, గెడ్డలు, రిజర్వాయర్లు, నదుల్లో నిరంతరం నీటి మట్టాన్ని గమనిస్తూ, ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నామన్నారు. ప్రసవానికి 10 రోజులు ఉన్న గర్భిణులను సైతం ఆసుపత్రికి తరలిస్తున్నారని కలెక్టర్ వివరించారు.
క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ప్రత్యేకాధికారి రవి సుభాష్
Minister Kondapalli Srinivas Review Meeting on Cyclone: క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని మొంథా తుఫాను జిల్లా ప్రత్యేకాధికారి రవి సుభాష్ ఆదేశించారు. ఆయన సముద్రతీర ప్రాంతంలో సోమవారం పర్యటించారు. ముందుగా కోనాడ జిల్లాపరిషత్ పాఠశాలలో మత్స్యకారులకోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. మత్స్యకారులతో మాట్లాడి వారికి కల్పించిన సదుపాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. కోనాడలో నెల్లిమర్ల ఎంఎల్ఏ లోకం నాగమాధవి ప్రత్యేకాధికారిని కలిసి చర్చించారు. తీరంలోని సమస్యలను ఆమె వివరించారు.
అనంతరం చింతపల్లి మండల పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను తనిఖీ చేశారు. రేషన్ సరుకులకు ఇబ్బంది రాకుండా చూడాలని, ఎప్పటికప్పుడు అందజేయాలని ఆదేశించారు. డెంకాడ గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు. సిబ్బంది విధులను తెలుసుకున్నారు. ప్రతీఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, తమకు అప్పగించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పరస్పరం సమన్వయంతో వ్యవహరించి, తుఫాను వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని, ప్రాణ ఆస్తి నష్టాలను నివారించాలని, ముందుగానే హెచ్చరికలు జారీ చేయాలని సుభాష్ సూచించారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్, ఆర్డిఓ డి.కీర్తి, తాహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

భద్రత దృష్ట్యా పునరావాస కేంద్రాలకు వెళ్ళండి – తీర ప్రాంత మత్స్యకారులకు కలెక్టర్, ఎస్పీ హితవు
జిల్లాలో తుఫాన్ పరిస్థితుల దృష్ట్యా భోగాపురం మండలం సముద్ర తీర ప్రాంతమైన ముక్కాం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ సోమవారం సంయుక్తంగా పర్యటించారు. ఈ సందర్భంగా వారు మత్స్యకారులతో మాట్లాడి, ప్రస్తుతం తుఫాన్ నేపథ్యంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించి, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సమీప పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని కలెక్టర్ సూచించారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, తాగునీరు, వసతి మరియు వైద్య సదుపాయాలు సక్రమంగా ఏర్పాటు చేయబడ్డాయని, ప్రజలు భయపడకుండా అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని, తమ భద్రత కోసం సహకరించాలని ఆయన కోరారు.
తుఫాన్ సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఈ సందర్బంగా కలెక్టర్ ఆదేశించారు. పోలీసులు, రెవెన్యూ, మత్స్య, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకొని నిరంతర పర్యవేక్షణ చేయాలని ఎస్పీ శ్రీ దామోదర్ ఆదేశించారు. తీర ప్రాంత గ్రామాల్లో నియంత్రణ గదులు (కంట్రోల్ రూమ్స్) ఏర్పాటు చేసి, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, సిపివో పి.బాలాజీ, డిపిఎం రాజేశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Also Read: శివ నామస్మరణతో మారుమ్రోగిన ఉమామహేశ్వర స్వామి ఆలయం
