బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్

Andhragazette - Sanjay Jaiswal

Andhragazette - Sanjay Jaiswal

Sanjay Jaiswal: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ, లోక్‌సభలో ఆ పార్టీ చీఫ్ విప్ సంజయ్ జైశ్వాల్ (Sanjay Jaiswal)కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రూ.10 కోట్ల ఇవ్వకుంటే ఆయన కుమారుడిని చంపేస్తామని అజ్ఞాత వ్యక్తులు బెదిరించారు. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులను ఆశ్రయించారు.

శుక్రవారం మధ్యాహ్నం కొద్దిపాటి వ్యవధిలోనే తనకు రెండు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సంజయ్ జైశ్వాల్ శనివారంనాడు ఫిర్యాదు చేశారని ఎస్‌డీపీఓ (బెట్టాయ్ టౌన్) వివేక్ దీప్ తెలిపారు. టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాల్ చేసిన వ్యక్తిని ట్రాక్ చేస్తున్నట్టు చెప్పారు. కాల్ చేసిన వ్యక్తికి క్రిమినల్ ముఠాతో సంబంధం ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. రాజకీయ వైరం ఉన్నట్టు ఎలాంటి సమాచారం లేదని, అయితే అన్ని కోణాల్లోంచి దర్యాప్తు జరుపుతున్నామని ఆయన తెలిపారు.

కాగా సంజయ్ జైశ్వాల్ బిహార్‌లోని పశ్చిమ చంపరాన్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బిహార్ బీజేపీ చీఫ్‌గా కూడా ఆయన సేవలందించారు. జైశ్వాల్‌ ప్రస్తుతం లోక్‌సభలో భాజపా చీఫ్‌ విప్‌గా ఉన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లోని కాంకేర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు ఆదివారంనాడు లొంగిపోయారు. వీరిలో 13 మంది మహిళలు, 9 మంది పురుషులు ఉన్నారు. వీరిలో నలుగురు డీవీసీఎంలు, 9 మంది ఎసీఎంలు, 8 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు 18 ఆయుధాలను పోలీసులకు స్వాధీనం చేసినట్టు బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి.సుందర రాజ్ తెలిపారు. వీరంతా కుమారి/కిస్కోడో ప్రాంత కమిటీ కేష్కల్ డివిజన్ (నార్త్ సబ్ జోనల్ బ్యూరో)కు చెందిన వారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులు 3 ఏకే-47 రైఫిల్స్, 4 ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 2 INSAS రైఫిల్స్, 6 పాయింట్ 303 రైఫిల్స్, 2 సింగిల్ షాట్ రైఫిల్స్, ఒక బీజీఎల్ వెపన్ స్వాధీనం చేసినట్టు వివరించారు.

రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించే క్రమంలో 21 మంది మావోయిస్టులు లొంగిపోవడం కీలక పరిణామమని, వారందరికీ పునరావాసం కల్పిస్తామని సుందర్‌రాజ్ చెప్పారు. తక్కిన మావోయిస్టు క్యాడెర్‌ కూడా శాంతి మార్గాన్ని ఎంచుకుని జనజీవన స్రవంతిలో కలవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ను 2026 మార్చి కల్లా నక్సల్స్ రహిత రాష్ట్రం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి.

Also Read: ‘కొమురం భీం’ని కీర్తించిన ప్రధాని నరేంద్రమోదీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *