జేడీయూకు ‘రెబల్స్‌’ ట్రబుల్‌

Andhragazette - JDU

Andhragazette - JDU

JDU: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార జేడీయూ (JDU) కు రెబల్స్‌ వ్యవహారం తలనొప్పిగా మారింది. పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయా స్థానాల్లో సొంత కూటమి అభ్యర్థులపైనే పోటీకి దిగారు. దీంతో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అధిష్ఠానం.. రెండు రోజుల వ్యవధిలో 16 మందిపై బహిష్కరణ వేటు వేసింది. ఓ సిట్టింగ్‌ ఎమ్మెల్యేతోపాటు ఇద్దరు మాజీ మంత్రులు ఈ జాబితాలో ఉన్నారు.

భాగల్‌పుర్‌ జిల్లా గోపాల్‌పుర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నరేంద్ర నీరజ్‌ ఎలియాస్‌ గోపాల్‌ మండల్‌ ఆ స్థానం వరుసగా నాలుగుసార్లు గెలిచారు. అయితే.. ఈసారి పార్టీ తనకు టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని తెలుసుకున్న ఆయన ఇటీవల పట్నాలోని సీఎం నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) నివాసం ఎదుట ధర్నాకు దిగారు. చివరకు నిరాశే ఎదురుకావడంతో… స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. మాజీ మంత్రులు శైలేశ్‌ కుమార్‌, హిమ్‌రాజ్ సింగ్‌ సైతం ఆయా స్థానాల నుంచి స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌ ప్రసాద్‌ యాదవ్‌, శ్యామ్‌బహదూర్‌ సింగ్‌, సుదర్శన్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్సీలు సంజయ్‌ ప్రసాద్‌, రణ్‌విజయ్‌ సింగ్‌, సంజీవ్‌ శ్యామ్‌ సింగ్‌లపైనా జేడీయూ చర్యలు తీసుకుంది.

అయితే ఈ నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, సిద్ధాంతాలను ఉల్లంఘించారని జేడీయూకు చెందిన ఓ సీనియర్‌ నేత ఆరోపించారు. అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా వారు పనిచేస్తున్నట్లు తెలిపారు. 243 అసెంబ్లీ స్థానాలు కలిగిన బిహార్‌ లో ఎన్డీయే కూటమిలో భాగంగా జేడీయూ 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. వచ్చే నెల 6న, 11న రెండు విడతల్లో పోలింగ్‌, 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

పంచాయతీ రాజ్ వ్యవస్థ, గ్రామ కోర్టుల ప్రతినిధుల వేతనాలు రెట్టింపు చేస్తాం తేజస్వీ

బిహార్‌ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) కీలక హామీ ప్రకటించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బిహార్ పంచాయతీ రాజ్ వ్యవస్థ, గ్రామ కోర్టుల ప్రతినిధుల వేతనాలను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. వారికి పెన్షన్, రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. చేతివృత్తులపై ఆధారపడిన వారికి.. తమ పనిని మరింత విస్తరించుకోవడానికి వీలుగా రూ.5 లక్షల వడ్డీ లేని రుణాన్ని అందిస్తామన్నారు. ఇప్పటికే మహిళల కోసం జీవికా దీదీ కమ్యూనిటీ మొబిలైజర్లకు నెలకు రూ.30 వేల చొప్పున నెలవారీ వేతనం చెల్లిస్తామని తమ పార్టీ ప్రకటించిందన్నారు.

నీతీశ్‌ నేతృత్వంలోని ప్రభుత్వంతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఆయనకు 20 ఏళ్లు అవకాశం ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారని.. తాము అధికారంలోకి వచ్చిన 20 నెలలలోనే బిహార్‌ను అభివృద్ధిలో నంబర్‌ 1 రాష్ట్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘మహాగఠ్‌బంధన్‌’లో చీలికలు ఉన్నాయని ఎన్డీఏ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తేజస్వి మండిపడ్డారు. వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (VIP) వ్యవస్థాపకుడు, డిప్యూటీ సీఎం అభ్యర్థి ముకేశ్ సహనీ తానూ కలిసి ప్రచారాల్లో పాల్గొంటున్నామని… త్వరలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కూటమి మ్యానిఫెస్టోపై చర్చలు జరుగుతున్నాయన్నారు.

Also Read: వైద్యురాలి ఆత్మహత్యపై సీఎం ఫడణవీస్‌ కీలక వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *