బిహార్ ఎన్నికల బరిలో భారతరత్నకర్పూరీ ఠాకుర్ మనవరాలు
బిహార్ రాజకీయాల్లో కులం కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నికల ఫలితాలు నిర్ణయించడంలోనూ కుల సమీకరణాలదే ముఖ్య భూమిక. ఈ పరిస్థితిని మార్చేందుకు కొన్ని దశాబ్దాల క్రితమే పోరాడిన నేత భారతరత్న కర్పూరీ ఠాకుర్. తన ఊరు పితౌంఝియాలో కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. అట్టడుగున ఉన్నవారిని రాజకీయంగా చైతన్యపరిచారు. ముఖ్యమంత్రి స్థాయికి చేరినా పూరి గుడిసెలోనే ఉండేవారు. ఒక కుమారుడు కేంద్రమంత్రి అయినా ఇప్పటికీ ఇతర కుటుంబసభ్యులు సాదాసీదా జీవితాన్నే గడుపుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన మనవరాలు పోటీచేస్తుండటంతో అనేకమంది దృష్టి ఆ గ్రామంపై పడింది.
కర్పూరీ 1924 జనవరి 24న సమస్తీపుర్ జిల్లాలో జన్మించారు. తండ్రి గోకుల్ క్షురకుడు. కర్పూరీ తొలుత ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ప్రతిఒక్కరూ కులవృత్తులు కొనసాగించాలని ప్రోత్సహించేవారు. కులప్రాతిపదికన చిన్నచూపు చూసేవాళ్ల కళ్లలోకి నేరుగా చూసే ధైర్యం రావాలంటే బాగా చదువుకోవడం మినహా మరో మార్గంలేదని చెప్పేవారు. కొన్ని కులాలకు స్థానిక భూస్వాములు తమ పొలాల్లో పని ఇవ్వడం మానేయడంతో అప్పట్లో కర్పూరీ నిరసనకు దిగారు. అలా రాజకీయాల దిశగా ఆయన అడుగులు పడ్డాయి.
ఓబీసీ, ఈబీసీ, మహిళలకు తొలిసారిగా కోటా
కర్పూరీ 22.12.1970 నుంచి 2.6.1971 వరకు సోషలిస్టు పార్టీ నాయకుడిగా, బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1977-79 మధ్య రెండోసారి సీఎంగా ఉన్నారు. దేశంలో తొలిసారిగా ఈబీసీలు, ఎంబీసీలు, మహిళలకు రిజర్వేషన్ కోటాలను అమలుచేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. తర్వాత చాలాఏళ్లకు జాతీయస్థాయిలో ఇవి అమల్లోకి వచ్చాయి. 1988లో మరణించే వరకు బిహార్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కర్పూరీ కొనసాగారు. ఆయన కన్నుమూసిన 36 ఏళ్ల తర్వాత 2024లో మోదీ సర్కారు భారతరత్నను ప్రకటించింది. ‘‘బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల గృహనిర్మాణ పథకం కింద తక్కువ ధరకు ఇంటిస్థలాన్ని తీసుకునేందుకు కర్పూరీ నిరాకరించారు. ఆయన మరణించినప్పుడు అనేకమంది నాయకులు ఆయన స్వగ్రామానికి వెళ్లారు. ఆయన ఇంటి పరిస్థితిని చూసి వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతటి మహోన్నత నేత చిన్న పూరిగుడిసెలో యావత్ జీవితాన్ని గడిపారా అని దిగ్భ్రాంతికి గురయ్యారు’’ అని ప్రధాని మోదీ ఆ సందర్భంగా రాసుకొచ్చారు.
కేంద్రమంత్రిగా కర్పూరీ కుమారుడు
ఠాకుర్ పెద్ద కుమారుడు రామ్నాథ్ ఠాకుర్ (75) జేడీయూ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అయితే కర్పూరీ చిన్న కుమారుడు వీరేంద్ర ఠాకుర్. ఆయన కుమార్తె జాగృతి ఠాకుర్ జన్ సురాజ్ పార్టీలో చేరి, ఈ ఎన్నికల్లో కర్పూరీ గ్రామ్ సమీపంలోనే ఉన్న మోర్బా అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. తాతయ్య ఆశయాలను నెరవేరుస్తానని ఆమె అంటున్నారు.
సమస్యలే సమస్తం!
సమస్తిపుర్ ప్రాంతంలో నిరుద్యోగం, అభివృద్ధి లేమి తీవ్ర సమస్యలుగా ఉన్నాయి. రోడ్లు దారుణంగా ఉన్నాయి. కులాల కుంపట్లు చల్లారినా ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది. నిరుద్యోగమూ అధికంగా ఉంది. రహదారి బురదతో నిండి ఇరుకుగా ఉంటుంది. కార్లు, లారీలు, ఇ-రిక్షాలు ఆగిఆగి వెళ్లాల్సిందే. అసలు ఆ గ్రామం నుంచి ఒకప్పుడు ముఖ్యమంత్రి పదవికి చేరిన వ్యక్తి ఉన్నారంటే ఇప్పటితరం నమ్మలేనంతగా పరిస్థితి ఉంది. ‘గ్రామాల్లో మహిళలు బాగా చదువుకున్నారు. అయినా వారికి ఉపాధి లేదు. చదువుకున్న పురుషులు వేరే ప్రాంతాలకు ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. మహిళలు ఇంటివద్దే ఉండాల్సి వస్తోంది’ అని కర్పూరీ ఠాకుర్ కుటుంబ సభ్యురాలు నిష ‘ఈటీవీ భారత్’కు తెలిపారు. ‘నా కుమారుడు వేరే రాష్ట్రానికి వెళ్లి ఉద్యోగం చేస్తున్నారు. ఇక్కడ అంత సంపాదించలేరు. ఈసారి స్థానికంగా ఉపాధి కల్పించేవారికే ఓటేస్తాం. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అమ్మేవారికి ఓటేయం’ అని స్థానికుడు స్పష్టం చేస్తున్నారు.
