వివేక్‌, హరీశ్‌ రావుల మధ్య మాటల యుద్ధం

WhatsApp Image 2025-07-22 at 15.29.39_59dd52b5

ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలపై మంత్రి గడ్డం వివేక్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. సిద్దిపేట కలెక్టరేట్‌లో బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఎప్పుడిస్తారో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. మూసీ సుందరీకరణ, ఫ్యూచర్‌సిటీ కోసం లక్షల కోట్లు వెచ్చిస్తామని చెబుతున్న ప్రభుత్వం… ఆరు గ్యారంటీల అమలుకు డబ్బుల్లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

దీనిపై మంత్రి వివేక్‌ స్పందిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం అవసరమైన చోట డబ్బులు ఖర్చు పెట్టకుండా.. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే లక్ష కోట్లు వెచ్చించిందని గుర్తు చేశారు. కేసీఆర్‌ హయాంలో చేసిన అప్పులను తాము చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. కాగా, సమావేశంలో మంత్రి వివేక్‌ మాట్లాడుతూ సన్నబియ్యం ఇస్తున్నారా అని అడగ్గా.. ఇవ్వడం లేదని మహిళలు చెప్పారు. ఈ విషయమై దృష్టి సారించాలని కలెక్టర్‌ హైమావతికి మంత్రి సూచించారు.

మొక్కజొన్న కొనుగోళ్లలో 18 క్వింటాళ్ల నిబంధనను ఎత్తివేయాలి – హరీశ్‌రావు

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఆలస్యంగా ప్రారంభించటంతో దళారులకు విక్రయిస్తూ రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎకరాకు గరిష్ఠంగా 18 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టడమేంటని ప్రశ్నించారు. ఇది పరోక్షంగా దళారులకు విక్రయించుకోవాలని చెప్పడమే అని, ఈ నిబంధనను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. సిద్దిపేటలోని పత్తి మార్కెట్‌ యార్డులో బుధవారం ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను హరీశ్‌రావు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలు లేక ఇప్పటికే సిద్దిపేట మార్కెట్‌ యార్డులో 14 వేల క్వింటాళ్ల మొక్కజొన్నలు దళారుల పాలయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌ శాఖ జేడీ మల్లేశం, డీఎంవో నాగరాజు, అధికారులు, భారత రాష్ట్ర సమితి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *