వివాదానికి దారితీసిన ఉదయనిధి స్టాలిన్ దీపావళి శుభాకాంక్షలు
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ (BJP) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. హిందుత్వంపై ఆయనకు ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనమని భాజపా నేత తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఎంకే పార్టీ హిందువులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. అసలేమయ్యిందంటే?
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… ప్రజలు తనకు దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి వెనకాడారని అన్నారు. ‘‘నేను వేదిక పైకి చేరుకున్నప్పుడు, చాలామంది నాకు పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు ఇచ్చారు. కొందరు నాకు దీపావళి శుభాకాంక్షలు చెప్పాలా, వద్దా అని సంకోచించారు. చెబితే నేను కోపం తెచ్చుకుంటానేమోనని భయపడ్డారు. కానీ నేను చెప్పేది ఒక్కటే.. హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న వారందరికీ దీపావళి శుభాకాంక్షలు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
దీంతో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖండించారు. డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అని అందరికీ తెలుసని అన్నారు. ఇతర మతాల వారికి శుభాకాంక్షలు చెప్పేటప్పుడు కేవలం విశ్వాసం ఉన్నవారికే అని ఆ పార్టీ నేతలు ఎప్పుడూ చెప్పలేదని.. హిందూ మతం విషయానికి వచ్చేసరికి వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన నమ్మకం ‘‘ఉన్నవారికి దీపావళి శుభాకాంక్షలు” అనే వ్యాఖ్యపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా తీవ్రంగా స్పందిస్తున్నారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ANS ప్రసాద్ స్పందిస్తూ.. హిందూ పండుగలపై డీఎంకే ప్రభుత్వం కనీస గౌరవం ప్రదర్శించబోదని మండిపడ్డారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడిని సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. అయినప్పటికీ ఎందుకనో డీఎంకే ప్రభుత్వం హిందూ మతంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తోంది. ఆ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది’’ అని ప్రసాద్ విమర్శించారు.
ఇదిలా ఉంటే… డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయ్‌నిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం అనేది సామాజిక అసమానతలకు మూలం అంటూనే.. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించకూడదు, నిర్మూలించాలి. ఇది డెంగీ, మలేరియా లాంటి వ్యాధిలా ఉంది అంటూ విమర్శించారు. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడగా.. దేశవ్యాప్తంగా కేసులు కూడా నమోదు కావడంతో కోర్టుల్లో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన చట్టసభ సభ్యుడిగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
