మీ ఇంట్లో బ్రహ్మస్థానం ఎక్కడుంటుందో తెలుసా ?
ఇంటి నిర్మాణంలో మెట్లకు చాలామంది ప్రాధాన్యం ఇవ్వరు. కానీ మెట్ల దిశ, స్థానం ఇంటి పాజిటివ్ వైబ్స్పై గొప్ప ప్రభావం చూపుతాయి. శ్రేయస్సు కోసం మెట్లకు సంబంధించిన ఈ 10 వాస్తు చిట్కాలు తప్పక పాటించండి. ఇంటి లోపల మెట్ల కోసం 10 వాస్తు చిట్కాలు:
మెట్ల దిశ : వాస్తు సిద్ధాంతాల ప్రకారం, ఇంట్లోని మెట్లు ఎల్లప్పుడూ సవ్యదిశలో ఉండాలి. అంటే తూర్పు నుండి పడమర లేక ఉత్తరం నుండి దక్షిణం వైపు తిరగాలి. అపసవ్య దిశలో నిర్మించిన మెట్లు కెరీర్ వృద్ధిపై హానికర ప్రభావం చూపుతాయి.
పశ్చిమం లేక దక్షిణం భాగం: మెట్లను ఇంటి నైరుతి, దక్షిణం లేక పశ్చిమ భాగంలో నిర్మించండి. ఈశాన్య భాగంలో మెట్లను అస్సలు నిర్మించవద్దు. దీని వలన ఆర్థిక నష్టం వాటిల్లుతుంది.
స్పైరల్ డిజైన్ వద్దు: స్పైరల్ (గుండ్రని) మెట్ల డిజైన్ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా, వాస్తు సూత్రాల ప్రకారం ఇవి ఇంటి శక్తికి వినాశకరంగా పరిగణిస్తారు. వీటి వలన నివాసితుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
మెట్ల సంఖ్య: మెట్ల సంఖ్య బేసి సంఖ్యలో ఉండాలని వాస్తు నిపుణులు సిఫార్సు చేస్తారు. 9, 15, 21 వంటి సంఖ్యలు ఇంటి యజమానులకు అదృష్టం, శ్రేయస్సు తెస్తాయి. దశల సంఖ్య సున్నాతో ముగియకూడదు.
పక్క స్థానం : ఇంటి లోపల మెట్లను ఎప్పుడూ ఇంటి ఒక పక్కనే ఉంచాలి. ఇంటి మధ్యలో లేక అతిథులకు పూర్తిగా కనిపించే ప్రదేశంలో ఉంచిన మెట్లు ఇంటిపై ఒత్తిడి పెంచుతాయి. సానుకూల శక్తిని హరిస్తాయి.
లేత రంగులు: మెట్లకు లేత రంగులు (పాస్టెల్ షేడ్స్) వేయటం మంచిది. లేత గోధుమరంగు, ఆఫ్-వైట్, లేత పసుపు లేక లేత నీలం లాంటి మృదువైన టోన్లు ఎంచుకోవచ్చు. నలుపు, ఎరుపు వంటి ముదురు రంగులు ప్రతికూలత ప్రేరేపిస్తాయి కాబట్టి వాటిని వాడకూడదు.
బ్రహ్మస్థానం నుండి దూరం: ఇంటి మధ్య భాగం బ్రహ్మస్థానం. ఇది అత్యంత పవిత్ర స్థానం. మంచి వైబ్స్ నిర్ధారించడానికి మెట్లను ఈ పవిత్ర భాగం నుండి కనీసం 1.5 మీటర్ల దూరంలో ఉంచాలి.
బాహ్య మెట్లు : ఇంటి వెలుపల మెట్లు నిర్మించేటప్పుడు తూర్పు ముఖంగా ఉన్న ఇంటికి ఆగ్నేయం, పడమర లేక దక్షిణం వైపు ఉన్న ఇంటికి నైరుతి, ఉత్తరం వైపు ఇంటికి వాయువ్యం ఆదర్శ దిశలు.
మెట్ల క్రింద నిల్వ: మెట్ల కింద ఖాళీ స్థలాన్ని బాత్రూమ్, పూజా గది లేక నగదు, నగలు లాంటి విలువైన వస్తువుల నిల్వ కోసం ఉపయోగించవద్దు. సాధారణ గృహోపకరణాలు, క్రీడా పరికరాలు లాంటివి ఉంచటానికి మాత్రమే ఈ స్థలం వినియోగించాలి.
తలుపుల స్థానం: వాస్తు మార్గదర్శకాల ప్రకారం, మెట్ల ప్రారంభంలో లేక చివర్లో మాత్రమే తలుపులు నిర్మించాలి. ఇంటి తూర్పు లేక ఉత్తర గోడలకు మెట్లు తగలకుండా చూసుకోవాలి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం వాస్తు సిద్ధాంతాలపై ఆధారపడినది. ఇది నివాసితుల శ్రేయస్సు కోసం వాస్తు నిపుణులు సూచించిన మార్గదర్శకాలు. మీ ఇంటి మెట్ల నిర్మాణం వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవటానికి నిర్మాణానికి ముందు వాస్తు నిపుణుడి సహాయం తీసుకోవడం మంచిది.
