మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే మా లక్ష్యం – పవన్ కల్యాణ్

hq720

ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించడంతోపాటు వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించాలని అధికారులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో 100 రోజుల ప్రణాళిక అమలుపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో పాటు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ), విశాఖ శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం, శాస్త్రవేత్తలతో ఆయన చర్చించారు. మత్స్యకారులలో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం సముపార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఇటీవల కాకినాడ పర్యటన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు. ముఖ్యంగా చేపల వేటలో మెలకువలు నేర్పడం, నైపుణ్యం పెంచడంతోపాటు తగిన సౌకర్యాల కల్పనపైనా దృష్టి సారించాలని తెలిపారు. వీటితోపాటు మత్స్య సంపదను పెంపొందించడం తదితర అంశాలపై విశాఖ సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్ కె. కిజాకుడాన్ సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఆయన సూచనలను అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ, మత్స్య శాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ బిందు మాధవ్, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్ర వర్షిణి తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ వ్యవస్థలో యువతను భాగస్వామ్యం చేస్తాం – పవన్ కల్యాణ్

రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సమాజంలో మార్పు కాంక్షించే ప్రతి ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ‘సేనతో సేనాని- మన నేల కోసం కలిసి నడుద్దాం’ అంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని జనసేన (Janasena) నిర్వహించనుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుందని తెలిపారు. మార్పు కోరుకుంటే రాదని.. మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుందని ఉద్ఘాటించారు. ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు QR కోడ్ స్కాన్ చేసి, లేదా లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *