మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తాం – రామ్మోహన్ నాయుడు

m_Chirala_activity_beach_l_441_757

విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో అక్కడి నేవీ అధికారుల చేతిలో బందీలు అయిన ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. డిల్లీలో ఉన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాధితులను తిరిగి సొంత ప్రాంతాలకు తీసుకువచ్చే చర్యలను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సమస్యపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో చర్చించి పరిస్థితిని వివరించారు. బుధవారం రాత్రి ఇదే విషయంపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సమీక్షలో ప్రభుత్వం తరుపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా జై శంకర్ తెలియజేశారు. అలానే బంగ్లాదేశ్ లో ఉన్న ఇండియా మిషన్, మరియు కోస్ట్ గార్డ్ లతో నిరంతరం ఇదే విషయంపై ఆ సంప్రదింపులు చేస్తున్నట్టు రామ్మోహన్ నాయుడుకు పరిస్థితిని తెలియజేశారు.

కాగా విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు… ఈ నెల 13న విశాఖలోని రెల్లివీధికి చెందిన సత్యనారాయణకు చెందిన బోటును తీసుకొని చేపల వేటకు వెళ్ళారు. బుధవారం తెల్లవారుజామున వేట కొనసాగిస్తుండగా పొరపాటున బంగ్లాదేశ్ సాగర జలాల్లోకి వెళ్లినట్టు గుర్తించారు. దీంతో అక్కడి నౌకాదళ అధికారులు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ సంఘటనపై ఇప్పటికే దుబాయ్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు సైతం సత్వరమే స్పందించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా నిరంతరం అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించడమే కాకుండా వారిని జాగ్రత్తగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు పూర్తి భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ ఎంబసీతో నిరంతర సంప్రదింపులు, నిశిత పరిశీలన చేస్తున్నామని తెలిపారు. సముద్ర భద్రత, చట్టం, రక్షణ వ్యవహారాలు చూసే కోస్ట్ గార్డ్ వ్యవస్థతో ఈ సమస్యపై మాట్లాడామని రామ్మోహన్ నాయుడు లేఖలో వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *