భారత్ – దక్షిణాఫ్రికా మ్యాచ్ కు రోజుకు 60 రూపాయలే
దక్షిణాఫ్రికా జట్టు నవంబర్ 14 నుంచి భారత్‌లో (IND vs SA) పర్యటించనుంది. ఇందులోభాగంగా… రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, అయిదు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 14 నుంచి 18 మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. 2019లో టీమ్‌ఇండియా, బంగ్లాదేశ్‌తో ఇదే వేదికపై పింక్‌బాల్ టెస్ట్‌లో తలపడింది. ఆ తర్వాత ఈ మైదానంలో జరగబోయే తొలి టెస్ట్ ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో మొదటి మ్యాచ్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ టికెట్ల ధరలు రోజుకు 60 రూపాయల (మొత్తం అయిదు రోజులకు 300 రూపాయలు) నుంచి గరిష్ఠంగా రోజు 250 రూపాయల వరకు (మొత్తం అయిదు రోజులకు రూ.1,250) ఉంటాయని పేర్కొంది. దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్ట్‌కు ముందు.. ఈ మైదానం రంజీట్రోఫీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.
