భాగస్వామ్య సదస్సుకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి – జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్
నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్టణం వేదికగా జరగనున్న భాగస్వామ్య సదస్సుకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. జేసీ కె. మయూర్ అశోక్, సీఐఐ ప్రతినిధులు, నిర్వాహకులు, జిల్లా అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం తన ఛాంబర్లో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన వివిధ అంశాలపై చర్చించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కావున అందరూ అప్రమత్తంగా ఉండాలని, అప్పగించిన విధులను అత్యంత బాధ్యతగా నిర్వర్తించాలని నిర్దేశించారు. ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా సీఐఐ ప్రతినిధులతో సమన్వయం వహించుకోవాలని అధికారులకు సూచించారు. 13వ తేదీ సాయంత్రం నుంచి అన్ని రకాల కార్యకలాపాలు మొదలవుతాయని, 14, 15వ తేదీల్లో ప్రధాన ఈవెంట్లు జరుగుతాయని పేర్కొంటూ దానికి తగ్గట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వీఐపీలు, అతిథుల రాక కోసం ప్రత్యేక పార్కింగు సదుపాయాలు కల్పిస్తూ.. ఎంట్రీ, ఎగ్జిట్లు పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటి నుంచే ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని స్వాధీనం చేసుకొని పనులు మొదలు పెట్టాలని సూచించారు. లెవెలింగ్ పనులు చేయాలని, చిన్నచిన్న రాళ్లను తొలగించాలని ఆదేశించారు. జీవీఎంసీ, హార్టికల్చర్ విభాగాల ఆధ్వర్యంలో బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని సూచించారు. ఆకర్షించే విధంగా విభిన్న రీతిలో పెయింటింగులు వేయాలని, ప్రచారానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పారిశుద్ధ్యమైన చర్యలు చేపట్టాలని, పార్కింగ్, ప్రధాన ఈవెంట్ ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారుల కలెక్టర్ నిర్దేశించారు. బుధవారం నుంచే ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో అంబులెన్స్ ను, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని డీఎం&హెచ్వోను ఆదేశించారు. ప్రస్తుత అవసరాలకు, ప్రధాన కార్యక్రమానికి ఉపయోగపడే విధంగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నారు.
ప్రమాణాలు తప్పకుండా పాటించాలి
అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాని, ఫైర్ సేఫ్టీ చూసుకోవాలని, అవసరమైన మేరకు అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచాలని, ముందుగా తనిఖీలు చేపట్టి ధృవీకరించాలని అగ్నిమాపక శాఖ అధికారికి సూచించారు. ఏయూ పరిధిలోని అంతర్గత డ్రెయిన్లను శుభ్రం చేయాలని, ఏమైనా మైనర్ రిపేర్లు ఉంటే చేయించాలని ఏయూ అధికారులకు చెప్పారు. కార్యక్రమ నిర్వహణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సరఫరా చేయాలని, బీఎస్ఎన్ఎల్, ఇతర నెట్ వర్క్ ల సాయంతో కనెక్టివిటీ సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రపంచ దేశాల నుంచి అతిథులు, రాజకీయ, అధికార ప్రముఖులు విచ్చేస్తున్న క్రమంలో వారు బస చేసేందుకు అనువైన హోటల్ రూమ్లను అందుబాటులో ఉంచుకోవాలని, ముందు నుంచే బుకింగ్ చేసుకోవాలని పేర్కొన్నారు. అలాగే హోం స్టే విధానంలో భాగంగా సంబంధిత నిర్వాహకులను గుర్తించాలని, వాటిల్లో కూడా అతిథులు బస చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పర్యాటక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్ట్రక్చరల్ ఈవెంట్స్, ప్రధాన వేదికలను పూర్తిస్థాయిలో పరిశీలించి ధృవీకరణ పత్రాలు అందజేయాలని ఆర్ & బి అధికారులకు సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం వహించి భాగస్వామ్య సదస్సును విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
