ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ లో తన్వికి రజతం
సంచలన ప్రదర్శనతో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన భారత యువ షట్లర్ తన్వి శర్మ.. పసిడి పతకం గెలవలేకపోయింది. ఫైనల్లో ఓడిన ఆమె.. రజతంతో సరిపెట్టుకుంది. ఆదివారం ఆసక్తికరంగా సాగిన బాలికల సింగిల్స్ తుది పోరులో 16 ఏళ్ల తన్వి 7-15, 12-15తో అన్యాపత్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్ హోరాహోరీగానే ఆరంభమైనప్పటికీ.. తన్వి వరుస తప్పులు చేయడంతో అన్యాపత్ 10-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే ఊపులో గేమ్‌నూ సొంతం చేసుకుంది.
రెండో గేమ్‌లో బలంగా పుంజుకున్న తన్వి 8-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తన జోరు చూస్తే మ్యాచ్ మూడో గేమ్‌లోకి వెళ్లేలా కనిపించింది. కానీ ఈ దశలో తన్వి మళ్లీ తడబడింది. తన బలహీనతలను సొమ్ము చేసుకున్న ప్రత్యర్థి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండానే 11-8తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి వరకు దూకుడు కొనసాగించి గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. స్వర్ణం సాధించకపోయినా తన్విది గొప్ప ప్రదర్శనే. ఎందుకంటే ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్‌లో 17 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కిన పతకమిది. చివరగా 2008లో సైనా ఈ టోర్నీలో స్వర్ణం సాధించింది. ‘‘మ్యాచ్‌లో ఆరంభం నుంచి అంత సౌకర్యంగా లేను. చాలా తప్పులు చేశా. రెండో గేమ్‌లో నాదైన స్ట్రోక్‌లు ఆడగలిగాను. కానీ 8-5తో ఆధిక్యంలో ఉన్నపుడు మళ్లీ తప్పులు చేశా. ప్రత్యర్థి నా ఆటను బాగా చదివేసింది’’ అని మ్యాచ్ అనంతరం తన్వి పేర్కొంది.
