పత్తి రైతులను ఆదుకుంటాం – మంత్రి పొంగులేటి
ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకుంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం గోల్‌తండలో 2025 వానాకాలం సీజన్‌కు సంబంధించి సీసీఐ తొలి కేంద్రాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సీజన్‌లో భారీ వర్షాల వల్ల రైతులకు దిగుబడి తగ్గిపోయిందన్నారు. సీసీఐ ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. గిట్టుబాటు ధర అందించేందుకు, మద్దతు ధర పెంచేలా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వారా చర్చకు పెడతామన్నారు. తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టాలని చూస్తే ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.
ప్రతి సీపీఐ కేంద్రం వద్ద వచ్చే అభ్యంతరాలను పరిష్కరించేందుకు వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే స్థానిక కమిటీలు చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. వ్యవసాయ అధికారుల వద్ద తేమ యంత్రాలు ఉన్నాయని, రైతుల పొలాల వద్దనే తేమ శాతం పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటి వద్ద ఆన్‌లైన్ బుకింగ్ ఎలా తీసుకోవాలనే దానిపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. పత్తి రైతులకు నష్టం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తమ ప్రజా ప్రభుత్వం పేదలపక్షపాతిగా పనిచేస్తోందని అందులో భాగంగానే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నేలపట్ల, ధర్మాతండా గ్రామాల్లో పొంగులేటి మాట్లాడుతూ పేదప్రజలకు ధైర్యం, భరోసా ఇచ్చేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి దఫాలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు సంబంధించిన నిధులను ప్రతి సోమవారం బ్యాంకుల్లో జమ చేస్తున్నామన్నారు. రైతును రాజు చేసేలా రూ.21 వేలకోట్ల రుణమాఫీ, సన్నధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చామని, ప్రస్తుత సీజన్‌కు కూడా బోనస్ ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందన్నారు. మరో పదిరోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతిధాన్యపుగింజను సేకరిస్తామని హామీ ఇచ్చారు.
