నయా నరకాసురులకు బుద్ధి చెప్పండి – పవన్ కల్యాణ్
దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటివారని, రూపాలు మార్చుకుంటూ తమను ఓడించారనే అక్కసుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దీపావళి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆశక్తికరమైన ట్వీట్ చేశారు. ‘దీప కాంతులతో శోభాయమానంగా… సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండగ దీపావళి. తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. మన భారతదేశంలో చేసుకునే ప్రతీ పండగకీ ఒక పరమార్థం ఉంది. మనకు జీవన శైలిని నేర్పుతుంది.
చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటాం. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలసి ఓడించారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటివారు. రూపాలు మార్చుకొంటూ- తమను ఓడించారనే అక్కసుతో.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారు.
కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి.. ఇలాంటి నయా నరకాసురులకు, వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళిని పర్యావరణహితంగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని పవన్ తన దీపావళి సందేశంలో పేర్కొన్నారు.
