నక్సల్స్ రహితంగా మారిన జిల్లాలకు మహర్దశ – కిషన్ రెడ్డి
మార్చి 31, 2026 నాటికి దేశంలో నక్సలిజం హింసను పూర్తిగా నిర్మూలించేందుకు మార్గం సుగుమం అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా వందలాదిమంది నక్సలైట్లు ముందుకు వచ్చి హింసా మార్గాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోవడాన్ని తాను స్వాగతిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో కిషన్ రెడ్డి నక్సల్స్ అంశం, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడారు.
‘గత మూడు రోజుల్లోనే 300మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారు. పెద్దఎత్తున నక్సలైట్లు లొంగిపోవడం, అందులో ఎక్కువమంది తెలుగువారు ఉండటం ప్రత్యేక విషయం. ఇంతకాలం నక్సలిజం కారణంగా అనేక జిల్లాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. నేడు దేశమంతా దీపావళి వేడుకలు జరుపుకుంటున్న వేళ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు చీకటి నుంచి వెలుగు వైపు అడుగులు వేస్తుండటం చాలా సంతోషించదగ్గ విషయం’ అని కిషన్ రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో దశాబ్దం క్రితం దేశంలో 125గా ఉన్న నక్సల్ ప్రభావిత జిల్లాలు.. నేడు 11కు తగ్గాయి. మిగిలిన ఈ 11 జిల్లాలు కూడా త్వరలోనే నక్సల్ రహిత జిల్లాలుగా మారతాయని ఆశిద్దామని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ‘అంబేడ్కర్ గారి రాజ్యాంగంలో హింసకు చోటు లేదు. అహింసా మార్గంలో ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవచ్చు. రక్తపాతం, హింస ద్వారా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమీ సాధించలేరనే సందేశం మరోసారి స్పష్టమయ్యింది.’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
‘నక్సలైట్ల కారణంగా ఇంతకాలం ఆ ప్రాంతాలు(నక్సల్స్ ప్రభావిత) రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి కూడా నోచుకోలేదు. కనీస మౌలిక వసతులు లేకుండా ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. నేడు నక్సల్ రహితంగా మారిన ఆయా జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది,’ అని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.
