దానంనాగేందర్ పై కేటీఆర్ సెటైర్లు
ఏ పార్టీలో ఉన్నాడో చెప్పలేని దానం నాగేందర్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా పెట్టుకోవడం కాంగ్రెస్ దిక్కుమాలిన రాజకీయాలకు నిదర్శనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను స్టార్ క్యాంపెయినర్‌గా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ ను నిలదీశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి… కాంగ్రెస్ తరఫున నిలబడి గెలవాలని సవాల్ విసిరారు. బస్తీ దవాఖానల నిర్వాహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజారోగ్యాన్ని విస్మరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
బంజారాహిల్స్‌లోని ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖానను ఆయన సందర్శించి, రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ… ఇప్పటికైనా నిద్ర మత్తు వదిలి బస్తీ దవాఖానాల్లో సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఇళ్లు కూల్చడం తప్ప చేసిందేమీ లేదని, ఇది ఆగాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలను మంగళవారం ఆయన పరామర్శించారు. కూకట్‌పల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నయా నరకాసురుడి అవతారమెత్తారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించుకుందామన్నారు. కాంగ్రెస్ పాలకుల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు. కాగా, హరీశ్ రావు పర్యటన జరుగుతుండగానే మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అర్ధంతరంగా వెళ్లిపోయారు. తనను కాదని, ఇతర నియోజకవర్గాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన మనస్తాపానికి గురయ్యారు. విషయం తెలసుకున్న హరీశ్.. ఆయనకు ఫోన్ చేసి బుజ్జగించారు. ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
40 మంది స్టార్ క్యాంపెయినర్లు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం కోసం 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీఆర్‌ఎస్ విడుదల చేసింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
