గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్
గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ కంపెనీ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ వైజాగ్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వైజాగ్‌ను అద్భుతమైన నగరం అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే, ఏపీలో గూగుల్ కంపెనీ డేటా సెంటర్ ఏర్పాటు చేయటంపై తమిళనాడులో రచ్చ మొదలైంది.
అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేల మధ్య రచ్చ జరుగుతోంది. రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సుందర్ పిచాయ్ తమిళ వ్యక్తి అయినప్పటికీ గూగుల్ పెట్టుబడులను ఏపీలో పెడుతున్నాడని, స్టాలిన్ సర్కార్ పెట్టుబడులు తేలేకపోయిందని ఏఐఏడీఎమ్‌కే విమర్శలు చేస్తోంది. తమిళనాడులో జరుగుతున్న ఈ రచ్చపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు.
ఆ వీడియోలో ఏఐఏడీఎంకే నాయకుడు మాట్లాడుతూ.. ‘గూగుల్ కంపెనీ ఆంధ్రాలో పెట్టుబడులు పెడుతోంది. ఆ గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ మన మధురైకి చెందిన వాడు. ప్రభుత్వం గూగుల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే మన రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చేవి’ అని అన్నారు. దీనిపై అధికార పార్టీ నాయకుడు స్పందిస్తూ..‘జయ లలిత నిర్లక్ష్యం కారణంగానే చాలా కంపెనీలు ఆంధ్రాకు వెళ్లిపోయాయి’ అని అన్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకే నాయకుల కామెంట్లపై నారా లోకేష్ స్పందిస్తూ.. ‘ సుందర్ పిచాయ్ ఏపీని కాదు.. భారత్‌ను పెట్టుబడుల కేంద్రంగా ఎంచుకున్నారు’ అని స్పష్టం చేశారు.
