కోనసీమ పేలుడు ఘటన మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం
అంబేద్కర్ కోనసీమ జిల్లా పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన హోం మంత్రి అనిత, అధికారులు సురేష్, ఆకే రవికృష్ణ బాణసంచా పేలుడు ఘటనకు సంబంధించిన నివేదికను సీఎంకు అందించారు.
ఒకే షెడ్డులో ఒకే చోట 14 మంది కార్మికులు మెటిరీయల్ మాన్యుఫాక్చరింగ్ చేశారని, హార్డ్ మెటీరియల్ వాడటం వల్లే స్పార్క్ వచ్చి, మాన్యుఫాక్చరింగ్ జరుగుతున్న ప్రాంతంపై పడిందని నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ఏ మాత్రం నిబంధనలు పాటించలేదని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, లైసెన్సు ఇచ్చే ముందు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలని సూచించారు. తయారీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.
ఎక్స్ ప్లోజివ్ మెటీరియల్ పై నియంత్రణ కోసం ఇక నుంచి ఆన్ లైన్ ద్వారానే కొనుగోళ్లు జరిగేలా చూడాలన్న ముఖ్యమంత్రి బాణసంచా కోసం ఉపయోగించే పదార్ధాల కొనుగోళ్లు, తయారీపై పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం లేని తయారీ కేంద్రాలను, ఆథరైజేషన్ లేని వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దని సీఎం పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్ కేసులు పెట్టి కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. బాణసంచా తయారీ కేంద్రాలన్నీ నిబంధనల ప్రకారమే ఉండాలన్నారు. అలాగే, పనిచేసే వారికి వ్యక్తిగత బీమా ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
