కానిస్టేబుల్‌ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్ కౌంటర్

124-580x326

నిజామాబాద్‌ లో కానిస్టేబుల్‌ను హతమార్చిన వాహనాల దొంగ రియాజ్‌ (24) పోలీసు కాల్పుల్లో మృతిచెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్‌… కానిస్టేబుల్‌ నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. రియాజ్‌ మృతిని డీజీపీ శివధర్‌రెడ్డి ధ్రువీకరించారు.

ఈ నెల 17న నిజామాబాద్‌ వినాయక్‌నగర్‌లోని సీసీఎస్‌ ఠాణాకు తరలిస్తున్న కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను రియాజ్‌ కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటనా స్థలం నుంచి తన స్నేహితుడి బైక్‌పై పరారైన అతడు… మహ్మదీయకాలనీలోని తన నివాసానికి వెళ్లి దుస్తులు మార్చుకుని బయటకొచ్చాడు. నగరంలోనే వివిధ ప్రాంతాల్లో తప్పించుకుని తిరిగాడు. రియాజ్‌ నగర పరిధి దాటలేదన్న సమాచారంతో పోలీసులు శనివారం రాత్రి అనుమానిత ప్రాంతాలను డ్రోన్‌ కెమెరాల సాయంతో జల్లెడపట్టారు.

ఈ క్రమంలో ఐదో ఠాణా పరిధిలో ఓ చోట రియాజ్‌ కంటపడగా… పట్టుకునే లోపే కెనాల్‌లోకి దూకి తప్పించుకున్నాడు. అక్కడ అతడి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని సారంగాపూర్‌ శివారులో రియాజ్‌ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ పాడుబడ్డ లారీ క్యాబిన్‌లో దాక్కొని.. పోలీసులు రావడం చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికుడు సయ్యద్‌ ఆసిఫ్‌ అతడిని పట్టుకోబోయాడు. ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకోగా.. రియాజ్‌ తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్‌ ఎడమచేతిని తీవ్రంగా గాయపరిచాడు. ఈలోపు పోలీసు బృందం నిందితుడిని చుట్టుముట్టి తాళ్లతో బంధించింది.

ఆసిఫ్‌ను నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పెనుగులాటలో నిందితుడు రియాజ్‌ సైతం తీవ్రంగా గాయపడటంతో నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో సోమవారం ఆస్పత్రిలో ఉన్న కానిస్టేబుల్‌ నుంచి తుపాకీ లాక్కునేందుకు రియాజ్‌ ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు.

రియాజ్‌ పోలీసుల వద్ద ఆయుధాన్ని లాక్కుని కాల్పులకు యత్నించాడు – డీజీపీ శివధర్‌రెడ్డి

నిజామాబాద్‌లో పోలీసుల కాల్పుల్లో నిందితుడు రియాజ్‌ మృతిచెందిన ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. రియాజ్‌ తప్పించుకుని పారిపోతూ పోలీసులపై మరోసారి దాడికి పాల్పడ్డాడని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు.. బాత్‌రూంకు వెళ్లి తిరిగి వస్తూ దాడికి తెగబడినట్లు తెలిపారు. ‘‘రియాజ్‌ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. వారి దగ్గరున్న ఆయుధాన్ని లాక్కుని కాల్పులకు యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్‌ చనిపోయాడు. ఆదివారం అతడిని పట్టుకునే క్రమంలో స్థానికుడు ఆసిఫ్‌పై దాడి చేశాడు. ఇవాళ మరో కానిస్టేబుల్‌ను గాయపరిచి పారిపోయేందుకు యత్నించాడు’’ అని డీజీపీ వెల్లడించారు.

కానిస్టేబుల్ ప్రమోద్‌ కుమార్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం

కానిస్టేబుల్ ప్రమోద్‌ కుమార్‌కు పోలీసు శాఖ తరఫున నివాళులర్పిస్తున్నట్లు డీజీపీ శివధర్‌ రెడ్డి తెలిపారు. ప్రమోద్ కుమార్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించారు. ‘‘రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ కట్టుబడి ఉంది. నేరస్థులు ఎంతటి వారైనా కఠినంగా అణచివేస్తాం. ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి పరిహారం, 300 గజాల ఇంటి స్థలం అందిస్తాం. పోలీసు భద్రత, వెల్ఫేర్ బోర్డుల నుంచి రూ. 24 లక్షల పరిహారం ఇస్తాం. ప్రమోద్‌ కుటుంబ సభ్యుల్లో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా’’ అని డీజీపీ వెల్లడించారు. రియాజ్‌ మృతితో నిజామాబాద్‌లో స్థానికులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. నిందితుడు రియాజ్ చనిపోవడం పట్ల కానిస్టేబుల్‌ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.

‘‘బైకులు, బుల్లెట్ వాహనాల చోరీల్లో రియాజ్‌ సిద్ధహస్తుడు. ఇంజిన్‌ నంబర్లు మార్చి మహారాష్ట్రలో బైకులు అమ్మేశాడు. నిజామాబాద్‌, బోధన్, ఆర్మూర్ పీఎస్‌లలో రియాజ్‌పై కేసులు ఉన్నాయి. గత మూడేళ్లలో రియాజ్‌పై 40 కేసులు నమోదయ్యాయి. రియాజ్‌ మూడు సార్లు బెయిల్‌పై బయటికి వచ్చాడు’’ అని నిజామాబాద్‌ సీపీ సాయి చైతన్య తెలిపారు.

రియాజ్‌ మృతిపై సీపీ సాయి చైతన్య

గత్యంతరం లేని పరిస్థితుల్లోనే రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని నిజామాబాద్‌ సీపీ సాయి చైతన్య స్పష్టం చేశారు. రియాజ్‌ మృతి గురించి సీపీ సాయి చైతన్య వివరాలను వెల్లడించారు. ‘‘ఉదయం ఆసుపత్రిలో నిందితుడు రియాజ్‌ గొడవ చేశాడు. ఆసుపత్రిలో అద్దం పగలకొట్టి అందరిపై తిరగబడ్డాడు. విధుల్లో ఉన్న ఆసుపత్రి సిబ్బంది, పోలీసులపై రియాజ్‌ తిరగబడ్డాడు. గోల చేస్తున్న రియాజ్‌ను బెడ్‌పై పడుకోబెట్టే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్ దగ్గరున్న తుపాకీ లాక్కుని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశాడు. తుపాకీ కింద పడేయాలని ఆర్‌ఐ హెచ్చరించినా రియాజ్‌ వినలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే రియాజ్‌పై ఆర్‌ఐ కాల్పులు జరిపారు. ఆర్‌ఐ కాల్పులు జరపగానే రియాజ్‌ నేలపై పడిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నాం’’ అని సాయి చైతన్య తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *