ఏపీలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఏపీలోని ప్రకాశం, వైఎస్‌ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పల్నాడు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు చోట్ల వర్షం పడుతోంది.
నెల్లూరు జిల్లాలో నాలుగు రోజులుగా వర్షం కురుస్తోంది. ఏఎస్ పేట వద్ద గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. పలు చెరువుల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది. చేజెర్ల, అనంతసాగరం ప్రాంతాల్లో వరి పంట నీటమునిగింది. భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యా సంస్థలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవు ప్రకటించారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాల దృష్ట్యా కలెక్టరేట్‌లో 0861 2331261, 79955 76699 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కడప జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. కాలువల్లో వ్యర్థాలు, చెత్తా చెదారాన్ని నగరపాలక సిబ్బంది తొలగిస్తున్నారు. అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు.
పొంచి ఉన్న వాయుగుండం ముప్పు
రాష్ట్రానికి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతం-ఉత్తర శ్రీలంక మధ్య అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా కదిలి నైరుతి, పశ్చిమ బంగాళాఖాతం మధ్య మధ్యాహ్నం వాయుగుండంగా మారే అవకాశముంది. వాయవ్యంగా కదిలి 24 గంటల్లో వాయుగుండం మరింత బలపడే అవకాశముంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు వాయుగుండం కదిలే అవకాశముంది. తమిళనాడు, కేరళలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మధ్యాహ్నం నుంచి తీరం వెంట 30-45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందిని తెలిపారు.
