ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి
మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్… ప్రత్యర్థిని 300ల్లోపే పరిమితం చేసింది భారత్.. ఛేదనలో స్మృతి, హర్మన్ నిలవడంతో గెలుపు దిశగా పయనించింది. 54 బంతుల్లో 56 చేస్తే చాలు విజయం భారత్‌దే. సెంచరీకి చేరువైన స్మృతి క్రీజులో ఉండడంతో అభిమానులూ భరోసాతోనే ఉన్నారు. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచే అవకాశాలు చేజార్చుకున్న హర్మన్‌ప్రీత్ బృందం… మరోసారి అదే దారిలో పయనించింది. కీలక సమయాల్లో వికెట్లు పోగొట్టుకుని.. దూకుడుగా ఆడలేక పరాజయం పాలైంది. సెమీస్ అవకాశాలనూ క్లిష్టం చేసుకుంది. 5 మ్యాచ్‌ల్లో రెండే గెలిచిన భారత్.. టోర్నీలో మిగిలిన ఏకైక సెమీస్ బెర్తును దక్కించుకోవాలంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో (న్యూజిలాండ్, బంగ్లాదేశ్) తప్పక నెగ్గాలి. 5 మ్యాచ్‌ల్లో 9 పాయింట్లతో ఇంగ్లాండ్ సెమీస్ బెర్తు దక్కించుకుంది.
సొంతగడ్డపై ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన భారత్‌కు మహిళల వన్డే ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ ఓటమి పాలయింది. ఆదివారం హర్మన్‌ప్రీత్‌సేన 4 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. మొదట ఇంగ్లాండ్ 8 వికెట్లకు 288 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెదర్ నైట్ (109; 91 బంతుల్లో 15×4, 1×6) సెంచరీతో మెరిసింది. అమీ జోన్స్ (56), నాట్ సీవర్ (38) కూడా రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ (4/51) ఆకట్టుకుంది. శ్రీ చరణి 2 వికెట్లు తీసింది. ఛేదనలో భారత్ 6 వికెట్లకు 284 పరుగులే చేయగలిగింది. స్మృతి మంధాన (88; 94 బంతుల్లో 8×4), హర్మన్‌ప్రీత్ కౌర్ (70; 70 బంతుల్లో 10×4), దీప్తి శర్మ (50; 57 బంతుల్లో 5×4) శ్రమ వృథా అయింది. నాట్ సీవర్ (2/47), లిన్సీ స్మిత్ (1/40) ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
స్మృతి, హర్మన్ నిలిచినా..: ఒకవైపు సవాల్ విసిరే లక్ష్యం.. మరోవైపు 13 పరుగులకే తొలి వికెట్.. ఇలా మొదలైంది భారత్ ఇన్నింగ్స్. ఇంగ్లిష్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్మృతి మంధాన కూడా వేగంగా ఆడలేకపోయింది. హర్లీన్ డియోల్ (24; 31 బంతుల్లో 5×4) కొన్ని బౌండరీలు కొట్టడంతో భారత్ స్కోరింగ్ రేటు మరీ పడిపోలేదు. హర్లీన్ వెనుదిరిగినా.. స్మృతి, హర్మన్ నిలిచారు. ఒత్తిడిని తట్టుకుంటూ.. స్కోరు పెంచారు. డీన్ వేసిన 24వ ఓవర్ తొలి బంతికే హర్మన్‌ప్రీత్ వెనుదిరగాల్సింది. అంపైర్ కూడా ఆమెను ఎల్బీగా ప్రకటించింది. కానీ సమీక్షలో నాటౌట్‌గా తేలింది. అప్పటికి ఆమె స్కోరు 39. తర్వాత 60 బంతుల్లో స్మృతి.. 54 బంతుల్లో హర్మన్ అర్ధసెంచరీలు అందుకున్నారు. 30 ఓవర్లకు 167/2తో భారత్ పటిష్టస్థితిలో నిలిచింది. అయితే హర్మన్‌ను నాట్ సీవర్ ఔట్ చేసి ఇంగ్లాండ్‌కు బ్రేక్ ఇచ్చింది. స్మృతి-హర్మన్ జంట మూడో వికెట్‌కు 125 పరుగులు జత చేసింది. వికెట్ పడినా.. భారత్ ఒత్తిడికి గురి కాలేదు. దీప్తి శర్మతో కలిసి స్మృతి ఇన్నింగ్స్‌ను నడిపించింది. సెంచరీ దిశగా సాగుతున్న స్మృతిని లిన్సీ స్మిత్ ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. తర్వాత రిచా ఘోష్ (8)తో పాటు కుదురుకున్న దీప్తి వెనుదిరగడంతో భారత్ ఒత్తిడిలో పడిపోయింది. అమన్‌జ్యోత్ (18 నాటౌట్), స్నేహ్ రాణా (10 నాటౌట్) వేగంగా ఆడలేకపోయారు. చివరి ఓవర్లో గెలవాలంటే 14 పరుగులు అవసరమయ్యాయి. కానీ 5 బంతుల్లో 5 పరుగులే రావడంతో భారత్‌కు దారులు మూసుకుపోయాయి. చివరి బంతికి అమన్‌జ్యోత్ ఫోర్ కొట్టింది.
హెదర్ నైట్ 109
మొదట ఇంగ్లాండ్‌కు అమీ జోన్స్, టామీ బ్యూమాంట్ (22) శుభారంభం అందించారు. ఈ జంట ప్రమాదకరంగా మారుతున్న దశలో బ్యూమాంట్‌ను ఔట్ చేసిన దీప్తి.. భారత్‌కు తొలి వికెట్ అందించింది. తర్వాత అర్ధసెంచరీ చేసిన అమీ జోన్స్‌ను కూడా దీప్తినే పెవిలియన్ చేర్చింది. ఈ స్థితిలో హెదర్ నైట్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. ఆమెకు కెప్టెన్ నాట్ సీవర్ నుంచి సహకారం అందింది. 54 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన నైట్.. తర్వాత దూకుడు పెంచింది. ఆమె 86 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. ఇంగ్లాండ్ జోరు చూస్తే 300 అందుకోవడం ఖాయంగా కనిపించింది. కానీ ఆఖర్లో భారత బౌలర్లు చకచకా వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను కట్టడి చేశారు. 44.2 ఓవర్లకు 249/3తో ఉన్న ఇంగ్లిష్ జట్టు 39 పరుగుల తేడాతో 5 వికెట్లు చేజార్చుకుని మూడొందల్లోపు స్కోరుకే పరిమితమైంది. భారత్‌తో వన్డే ఇంగ్లాండ్ స్టార్ హెదర్ నైట్‌కు కెరీర్‌లో 300వ అంతర్జాతీయ మ్యాచ్. సెంచరీతో ఈ మ్యాచ్‌ను ఆమె చిరస్మరణీయం చేసుకుంది.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్:
బ్యూమాంట్ (బి) దీప్తి 22; అమీ జోన్స్ (సి) స్మృతి (బి) దీప్తి 56; హెదర్ నైట్ రనౌట్ 109; నాట్ సీవర్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) శ్రీచరణి 38; సోఫియా డంక్లీ (సి) దీప్తి (బి) శ్రీచరణి 15; ఎమ్మా లాంబ్ (సి) స్మృతి (బి) దీప్తి 11; అలీస్ క్యాప్సీ (సి) హర్లిన్ (బి) దీప్తి 2; చార్లీ డీన్ నాటౌట్ 19; ఎకిల్‌స్టోన్ రనౌట్ 3; లిన్సీ స్మిత్ నాటౌట్ 0; ఎక్స్‌టాలు 13 మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 288; వికెట్ల పతనం: 1-73, 2-98, 3-211, 4-249, 5-254, 6-257, 7-276, 8-280; బౌలింగ్: రేణుక 8-0-37-0; క్రాంతి గౌడ్ 8-0-46-0; స్నేహ్ రాణా 10-0-56-0; శ్రీచరణి 10-0-68-2; దీప్తి శర్మ 10-0-51-4; అమన్‌జ్యోత్ 4-0-26-0
భారత్ ఇన్నింగ్స్:
ప్రతీక (సి) జోన్స్ (బి) బెల్ 6; స్మృతి (సి) క్యాప్సీ (బి) లిన్సీ స్మిత్ 88; హర్లీన్ ఎల్బీ (బి) చార్లీ డీన్ 24; హర్మన్‌ప్రీత్ (సి) లాంబ్ (బి) నాట్ సీవర్ 70; దీప్తి (సి) డంక్లీ (బి) ఎకిల్‌స్టోన్ 50; రిచా (సి) నైట్ (బి) నాట్ సీవర్ 8; అమన్‌జ్యోత్ నాటౌట్ 18; స్నేహ్ రాణా నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (50 ఓవర్లలో 6 వికెట్లకు) 284; వికెట్ల పతనం: 1-13, 2-42, 3-167, 4-234, 5-256, 6-262; బౌలింగ్: లారెన్ బెల్ 9-0-52-1; లిన్సీ స్మిత్ 10-0-40-1; నాట్ సీవర్ 8-0-47-2; చార్లీ డీన్ 10-0-67-1; సోఫీ ఎకిల్‌స్టోన్ 10-0-58-1; అలీస్ క్యాప్సీ 3-0-20-0
