ఢిల్లీలో రికార్డు స్థాయికి వాయు కాలుష్యం

Air-pollution.jpg

దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం కుమ్మేసింది. మంగళవారం నమోదయిన వాయు నాణ్యత నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. 24 గంటల సరాసరి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) సోమవారం 4 గంటల సమయంలో 345కి పడిపోయి, వెరీ పూర్‌ విభాగంలో చేరిందని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(సీపీసీబీ) తెలిపింది. దీపావళి తర్వాత 24 గంటల్లో సగటు పీఎం2.5 సాంద్రత ఒక క్యూబిక్ మీటర్‌కు 488 మైక్రోగ్రాములకు చేరింది. పండగకు ముందు ఇది 156.6 మైక్రోగ్రాములుగా ఉంది. ఇది గతంలో 2024లో 330, 2023లో 218, 2022లో 312, 2021లో 382గా నమోదైందని సీపీసీబీ గుర్తు చేసింది.

దీపావళి రోజ రాత్రి 8–10 గంటల మధ్య మాత్రమే బాణసంచా కాల్చాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అయితే, జనం ఆ పరిమితిని పట్టించుకోలేదు. అర్ధరాత్రి వరకు మోతమోగించారు. సోమవారం రాత్రి కాలుష్య కారక సూక్ష్మ ధూళి కణాల(పీఎం 2.5)స్థాయిలు 675కు చేరాయని సీపీసీబీ తెలిపింది. మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీపై దట్టమైన బూడిదరంగు మంచు మేఘాలు కమ్ముకున్నాయి. వాయు నాణ్యత రెడ్‌ జోన్‌ స్థాయికి చేరుకుంది. వీటన్నిటికీ పంజాబ్‌ రైతుల పంటవ్యర్థాల దహనమే కారణమని ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం ఆరోపించింది. పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం నిషేధాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని తెలిపింది. ఢిల్లీలో దీపావళికి ముందు ఏక్యూఐ 345 ఉండగా, మంగళవారం ఉదయం కేవలం 11 పాయింట్లు పెరిగి 356కి చేరుకుందని పేర్కొంది.

ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో టపాసులు కాల్చడం ద్వారా వెలువడిన ఉద్గారాలు, గాలుల మందగమనం తదితర అంశాలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలని ‘క్లైమేట్ ట్రెండ్స్‌’ అధ్యయనం పేర్కొంది. దిల్లీ విశ్వవిద్యాలయ అనుబంధ రాజధాని కళాశాల ప్రొఫెసర్ ఎస్‌కే ఢాకా సైతం ఇదే విషయం తెలిపారు. హరిత బాణసంచా నాణ్యత, అందులో వాడే పదార్థాలను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. దిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో ఇప్పటికే ‘గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-2 (GRAP-2) నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాయు నాణ్యత సూచీ (AQI) దిగజారడంతో ‘సెంట్రల్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM)’ ఈమేరకు చర్యలు తీసుకుంది. జీఆర్‌ఏపీ-1 అమల్లోకి వచ్చిన ఆరు రోజుల్లోనే ఈ ఆంక్షలు విధించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *