జ్యోతిర్లింగాల ప్రాముఖ్యత మీకు తెలుసా
శివుడు లయకారుడు. సాధారణంగా శైవులు శివుని లింగరూపంలోనే ఆరాధిస్తుంటారు. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. దేశంలోని శైవ క్షేత్రాల్లో ముఖ్యమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలు. ఈ ఆలయాలన్నీ స్వయంభువు ఆలయాలని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు వీటిని దేవతలే నిర్మించారని హిందువులు బలంగా విశ్వసిస్తారు. అసలు ఈ జ్యోతిర్లింగాలు ఎలా ఆవిర్భవించాయి? ఎక్కడెక్కడ ఈ జ్యోతిర్లింగాలు ఉన్నాయి? అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిర్లింగం అంటే ఏమిటి? ఎలా పుట్టింది?
శివ పురాణం ప్రకారం పరమశివుడు ఉత్తరా నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో అవతరించారని తెలుస్తోంది. జ్యోతిర్లింగమంటే శివుడు కొలువై ఉన్న దివ్యక్షేత్రం. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికి వాటిలో 12 మాత్రమే ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ఖ్యాతికెక్కాయి. హిందూ సంప్రదాయం ప్రకారం ఆకాశం నుంచి జ్యోతిర్లింగాలు దర్శిస్తే అగ్ని స్తంభాలు వలే కనిపిస్తాయని విశ్వాసం. శివుని లింగాకారం శివుని పవిత్ర ఉనికిని సూచిస్తుంది.
జ్యోతిర్లింగాలు ఎలా ఆవిర్భవించాయి?
ఒకసారి బ్రహ్మ, విష్ణువు తమ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంపై వాగ్వివాదానికి దిగారు. విషయం చిలికి చిలికి గాలివానగా మారింది. అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువుల కలహాన్ని ఆపడానికి వారివురు మధ్య ఒక ప్రకాశవంతమైన జ్యోతి స్థంభం వలే వెలిశాడు. అప్పుడు శివుడు, బ్రహ్మ విష్ణువులతో అగ్నిస్తంభం ఆది అంతాలను కనిపెట్టమని, ఎవరు ముందుగా కనిపెడితే వారే గొప్ప అని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ ఊర్ధ్వ లోకానికి వెళ్లగా, విష్ణువు పాతాళ లోకానికి వెళ్ళాడు. విష్ణువు నిజాయతీగా తాను అగ్నిస్తంభం మొదలు కనిపెట్టలేకపోయానని ఒప్పుకుంటే, బ్రహ్మ మాత్రం తాను కనిపెట్టానని అందుకు సాక్షిగా కేతకి పుష్పాన్ని, గోవును చూపించాడు. కానీ బ్రహ్మ అబద్దమాడాడని గ్రహించిన శంకరుడు బ్రహ్మకు భూలోకంలో పూజలుండవని శపించెను. అలాగే కేతకి పుష్పం పూజకు పనికిరాదని, గోవు తలతో అవునని చెప్పి, తోకతో కాదని చెప్పింది కాబట్టి గోవు తోకకు మాత్రమే పూజార్హత ఉంటుందని శపించాడు.
అగ్నిస్తంభమే అరుణాచలం
అనంతరం పరమ శివుడు వెలసిన ఆ జ్యోతిర్లింగ స్వరూప అగ్నిస్తంభం చల్లబడి అన్నామలై కొండల్లోని అరుణాచలేశ్వర జ్యోతిర్లింగంగా ఏర్పడింది.
ద్వాదశ జ్యోతిర్లింగాలు
పరమ శివుడు వెలసిన ఈ స్తంభం నుంచి ఏర్పడిన పన్నెండు జ్యోతిర్లింగాలు భూమిపై ద్వాదశ జ్యోతిర్లింగాలుగా విరాజిల్లుతున్నాయి. హిందువులు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ప్రతి జ్యోతిర్లింగం శివుని అనంతమైన ఉనికిని సూచిస్తుందని విశ్వాసం. అయితే ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే సమయంలో ఏర్పడలేదని, వేర్వేరు సందర్భాలలో, వేర్వేరు సమయాల్లో ఆవిర్భవించాయని పురాణాలు చెబుతున్నాయి.
జ్యోతిర్లింగ స్తోత్రం
సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్
పర్ల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే
వారాణస్యాం తు విశ్వేశం, త్రయంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.
ప్రతిరోజూ మూడు సార్లు ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఏడు జన్మల పాపాలు కూడా నశిస్తాయని శివ మహాపురాణం చెబుతోంది. కేవలం శ్లోకాన్ని పఠిస్తేనే ఇంత పుణ్యం ఉంటే ఇక ప్రత్యక్షంగా ఈ జ్యోతిర్లింగాలు దర్శిస్తే మరెంత పుణ్యమో కదా! పరమ పవిత్రమైన కార్తిక మాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు గురించి తెలుసుకున్నా కూడా దర్శించిన పుణ్యం లభిస్తుంది. మన దేశంలో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏ పేర్లతో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం -గుజరాత్
గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పఠాన్ గ్రామం వద్ద సోమనాథ్ క్షేత్రం ఉంది.
రెండో జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున జ్యోత్రిలింగ దివ్యక్షేత్రం – ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున శ్రీ శైల పర్వతం మీద శ్రీ మల్లికార్జున జ్యోత్రిలింగ దివ్యక్షేత్రం వెలసి ఉంది.
మూడోది శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం – మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినీలో దట్టమైన మహాకాల్ అడవిలో క్షిప్రా నది ఒడ్డున శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం వెలసి ఉంది.
నాలుగోది శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం – మధ్యప్రదేశ్
అత్యంత ప్రముఖమైన జ్యోతిర్లింగాల్లో నాలుగో జ్యోతిర్లింగం అయిన శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదిలో శివపురి అనే ద్వీపంలో వెలసి ఉంది.
ఐదోది శ్రీ వైద్యనాథ లేదా శ్రీ బైద్యానాథ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం – ఝార్ఖండ్
ఐదో జ్యోతిర్లింగమైన వైద్యనాధ జ్యోతిర్లింగం ఝార్ఖండ్‌లోని శాంటల్ పరగణాల్లో దెగఢ్ ప్రాంతంలో వద్ద వెలసి ఉంది.
ఆరవది శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం, పూణే – మహారాష్ట్ర
ఆరవ జ్యోతిర్లింగమైన శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం సహ్యాద్రి పర్వత సానువులపై భీమ నది ఒడ్డున వెలసి ఉంది.
ఏడవది శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం, రామేశ్వరం – తమిళనాడు
ఏడవ జ్యోతిర్లింగమైన శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం తమిళనాడులోని రామ సేతు తీరంలో రామేశ్వరం ద్వీపంలో వెలసి ఉంది.
ఎనిమిదవది శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం, బైట్ ద్వారక – గుజరాత్
ఎనిమిదవదైన శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం గోమతి ద్వారకా, గుజరాత్‌లోని సౌరాష్ట్ర తీరంలోని బైట్ ద్వారకా ద్వీపం మధ్య మార్గంలో ఉంది. ఈ క్షేత్రాన్ని శ్రీ నగనాథ జ్యోతిర్లింగ దివ్య క్షేత్రమని కూడా అంటారు.
తొమ్మిదవది శ్రీ కాశీ విశ్వనాధ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం, వారణాసి – ఉత్తర్‌ప్రదేశ్
తొమ్మిదవ జ్యోతిర్లింగమైన శ్రీ కాశీ విశ్వనాధ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం పవిత్ర గంగానది తీరంలో వారణాసి పట్టణంలో వెలసి ఉంది.
పదవది శ్రీ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం, నాసిక్ – మహారాష్ట్ర
పదవ జ్యోతిర్లింగమైన శ్రీ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్ నుంచి 30 కి.మీ.ల దూరంలో గోదావరి నది పుట్టిన త్రయంబకం అనే ప్రదేశంలో వెలసి ఉంది.
పదకొండవది శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం, కేదార్నాథ్ – ఉత్తరాఖండ్
పదకొండవ జ్యోతిర్లింగమైన శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం హిమాలయ సానువుల్లో అత్యంత ఎత్తైన ప్రదేశంలో కేదారేశ్వరంలో వెలసి ఉంది.
పన్నెండవది శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ దివ్య క్షేత్రం, ఔరంగాబాద్ – మహారాష్ట్ర
పన్నెండవ జ్యోతిర్లింగమైన శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ దివ్య క్షేత్రం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని దౌలాతబాద్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరుల్ అనే గ్రామంలో వెలసి ఉంది.
ఈ నెల 22 నుంచి కార్తిక మాసం ప్రారంభం కానున్న శుభ సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి తెలుసుకుందాం. దర్శించిన భాగ్యాన్ని పొందుదాం.
ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
