‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై ప్రధాని మోదీ దీపావళి వేడుకలు

PTI10_20_2025_000054B

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లతో కలిసి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఆదివారం రాత్రి గోవా సముద్ర తీరంలోని ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ లో ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొని సైనికులతో సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో మావోయిస్టుల లొంగుబాటు కూడా మొదలైంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ.. పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ దాయాదికి నిద్రలేని రాత్రులు మిగిల్చిందన్నారు. ‘‘నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పర్వదినాన్ని చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ దృశ్యం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఓవైపు నాకు మహా సముద్రం.. మరోవైపు భరతమాత అందించిన ధీర జవాన్ల బలం కన్పిస్తోంది. ఈ సముద్ర జలాలపై పడుతున్న సూర్యకిరణాలు.. జవాన్లు వెలిగించిన దీపపు కాంతుల వలే మెరుస్తున్నాయి’’ అని మోదీ కొనియాడారు.

అనంతరం ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సేవలను ప్రధాని కొనియాడారు. ‘‘భారత రక్షణ దళాల సామర్థ్యానికి ఈ విమాన వాహకనౌక ప్రతీక. ఆపరేషన్‌ సిందూర్ సమయంలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌.. పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టింది. శత్రుమూకల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. వారిని నిద్ర లేని రాత్రులను మిగిల్చింది. ఈ పేరు వింటే చాలు.. పాక్‌కు నిద్ర కూడా పట్టదు’’ అని మోదీ తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌లో పరాక్రమం ప్రదర్శించిన త్రివిధ దళాలకు ప్రధాని ఈ సందర్భంగా సెల్యూట్‌ చేశారు. రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించడం అత్యవసరం అని మోదీ పేర్కొన్నారు. మాతృభూమి కోసం ప్రాణాలర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్ధమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *