పాక్ బలగాలను భారతసరిహద్దు వరకు తరిమికొడతాం – అఫ్గాన్ మంత్రి
తమ దేశంపై ఆక్రమణకు యత్నిస్తే పాక్ బలగాలను భారత సరిహద్దు వరకు తరిమికొడతామని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ముహమద్ నబి ఒమరి హెచ్చరించారు. అఫ్గాన్ ఒకసారి నిర్ణయించుకుంటే పాక్ బలగాలకు భారత సరిహద్దు వరకు ఎక్కడా భద్రత ఉండదన్నారు. పాక్ ప్రభుత్వం, సైనిక నాయకత్వంపై కూడా ఒమరి విమర్శలు గుప్పించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు వీర సానుభూతిపరుడిగా మారి ముఖస్తుతి చేస్తున్నారని, పాక్‌లో సైనిక పాలన ఇతరుల ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని ఒమరి ఎద్దేవా చేశారు. డ్యూరాండ్ రేఖ కారణంగా అఫ్గాన్ కోల్పోయిన భూభాగాలన్నీ పాక్ తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, అఫ్గాన్, పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతల వేళ దోహాలో జరిగిన శాంతి చర్చలు ఫలించాయి. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో జరిగిన ఈ చర్చలకు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, అఫ్గాన్ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ హాజరయ్యారు. రెండు దేశాల మధ్య శాంతి, సుస్థిరత కోసం సరిహద్దుల్లో కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించారు. భవిష్యత్తులోనూ చర్చలు జరిపేందుకు అంగీకరించారు. ఈ మాసంలో పాక్ వైమానిక దాడుల్లో అఫ్గాన్ క్రికెటర్లు, సామాన్య పౌరులు పెద్ద సంఖ్యలో మృతిచెందారు. దీనికి ప్రతీకారంగా తాలిబన్ ఫైటర్లు దాడులకు పాల్పడటంతో పాక్ సైన్యానికి తీవ్ర నష్టం వాటిల్లింది.
కాల్పుల విరమణకు పాక్, అఫ్గాన్ మధ్య అంగీకారం
కాల్పుల విరమణకు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ అంగీకరించాయి. రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. గత కొన్ని రోజులుగా రెండు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు, దాడులు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు మరణించారు. ఈ నేపథ్యంలో ఖతార్‌లోని దోహాలో శనివారం పాక్, అఫ్గాన్ రక్షణ మంత్రులు ఖ్వాజా ఆసిఫ్, ముల్లా యాకుబ్‌ల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఈ చర్చలకు ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వం వహించాయి. వెంటనే కాల్పుల విరమణ అమలు చేసేందుకు రెండు దేశాలు అంగీకరించాయని ఖతార్ విదేశాంగశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దాని అమలు తీరును సమీక్షించేందుకు తదుపరి సమావేశాలను నిర్వహించాలని రెండు దేశాలు నిర్ణయించాయని వివరించింది.
