మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్
బిహార్ శాసనసభ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి (మహాగఠ్‌బంధన్) తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పేరు ఖరారైంది. ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా ‘వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ’ (వీఐపీ) అధినేత ముఖేశ్ సాహ్నీ పేరును నేతలు ప్రకటించారు. ఇతర వర్గాల నుంచి మరికొందరిని కూడా డిప్యూటీ సీఎంలుగా తీసుకుంటామని తెలిపారు. తేజస్వీ గతంలోనే డిప్యూటీ సీఎంగా పనిచేయగా, సహనీ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.కూటమిలో విభేదాలను సర్దుబాటు చేయడానికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ సమక్షంలో కూటమి నేతలు గురువారం పట్నాలో సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఈ పేర్లను వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల ఆమోదం ఈ ఎంపికలకు ఉందని గహ్లోత్ చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీకి మద్దతివ్వాలని నిర్ణయించాం. ఆయనకు ఎంతో భవిష్యత్తు, ప్రజల అండ ఉన్నాయి. ఉద్యోగాలు, ఇతర హామీలకు ఆయన కట్టుబడి ఉంటారు’ అని చెప్పారు.
20 నెలల్లో చేసి చూపిస్తా – తేజస్వి
కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాకుండా… బిహార్ అభివృద్ధి కోసం తాము చేతులు కలిపామని తేజస్వి చెప్పారు. ‘‘అవినీతి, నేరం అనే ఎన్డీయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి కలిసి పనిచేస్తాం. 20 ఏళ్లు అధికారంలో ఉన్న ఆ కూటమి ఈసారి నీతీశ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా ఆయనకు ‘అన్యాయం’ చేసింది. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటారని కేంద్ర మంత్రి అమిత్‌షా తాజాగా పేర్కొనడమే దానికి గట్టి నిదర్శనం. గతంలో లేని సాంకేతిక కారణాలు ఇప్పుడెందుకు చెబుతున్నారు? ఇప్పటివరకు సీఎం ఎవరనేది చెప్పే మీడియా సమావేశాన్నే ఎన్డీయే నిర్వహించలేదు. ప్రజలు మాకు అధికారమిస్తే.. 20 ఏళ్లలో ఎన్డీయే చేయని పనిని 20 నెలల్లో పూర్తిచేస్తాం. ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఏ కుటుంబం ఉండదని మేం ప్రతిజ్ఞ చేశాం’’ అని చెప్పారు.
