నేడు బిహార్‌కు మోదీ, అమిత్ షా
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా బిహార్ లో పర్యటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రక టించిన తర్వాత తొలిసారి మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అమిత్ షాకు ఇది రెండో పర్యటన. ఎన్డీయే తరఫున శుక్రవారం ఈ ఇద్దరు నేతలు మొత్తం నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. భారత రత్న, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ సొంత జిల్లా సమస్తిపూర్ నుంచి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
అనంతరం.. బెగుసరాయ్‌లో మరో బహిరంగ సభలో పాల్గొంటారు. హోం మంత్రి అమిత్ షా సివాన్, బక్సర్‌ల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ నెల 30వ తేదీన కూడా ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ముజఫర్‌పూర్, ఛప్రాలలో బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇద్దరు కీలక నేతలు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఎన్నికల ప్రచారంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరుగుతుందని, ఎన్డీయే ప్రచారానికి మరింత ఊతం ఇస్తాయని ఆ వర్గాలు చెబుతున్నాయి.
