బస్సు ప్రమాదంపై స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యం
కర్నూలు బస్సు ప్రమాదం (Kurnool Bus Accident) పై తీవ్ర విమర్శల వేళ… వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం స్పందించింది. బస్సుకు ఫిట్‌నెస్ లేదని, పైగా సర్టిఫికెట్లు కూడా కాలపరిమితి చెల్లాయని, అపరిమిత చలాన్లూ ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తమ బస్సుకు అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు వ్యాలిడ్‌లోనే ఉన్నాయంటూ యాజమాని వేమూరి వెంకటేశ్వర్లు పేరిట ఒక ప్రకటన వెలువడింది.
‘‘రాత్రి ప్రమాదం జరిగినట్టుగా మూడు గంటల 30 నిమిషాలకు మాకు సమాచారం అందింది. వర్షం పడుతున్న టైంలో రోడ్డుపైన బైకర్ స్కిడ్ అయ్యి.. బస్సును ఢీ కొట్టి పడిపోయాడు. బైక్ మంటలు చెలరేగి బస్సు కిందకు రావడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. ఆ సమయంలో మెయిన్ డోర్ వద్ద మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. రాడ్లతో మా డ్రైవర్లు అద్దాలు పగలకొట్టడంతో కొందరు బయటపడ్డారు. మా బస్సు కు సంబంధించి అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు వ్యాలిడ్‌లోనే ఉన్నాయి. బస్సులో మొత్తం 40 మంది రిజర్వ్డ్ ప్యాసింజర్ లు ఉన్నారు. అందరికీ మా ఏజెన్సీ తరఫున ఇన్సూరెన్స్ ఉంది. ప్రమాద ఘటనపై చింతిస్తున్నాం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని ఆ ప్రకటనలో ఉంది.
అయితే… ప్రమాదంలో వీ కావేరీ ట్రావెల్స్ యాజమాన్య నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోందని బస్సును పరిశీలించిన అధికారులు అంటున్నారు. కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని అంటున్నారు. ‘‘ప్రమాద సమయంలో బస్సు వంద కిలోమీటర్ల వేగంతో ఉంది. మంటలు ఆర్పేందుకు ఫోమ్ బాటిల్ కూడా అందుబాబులో లేదు. సేఫ్టీ విండో బద్ధలు కొట్టడానికి సుత్తి కూడా అందుబాబులో లేదు’’ అని అధికారులు తెలిపారు.
