BJP: బీఎంసీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు
BJP: త్వరలో జరుగనున్న ప్రతిష్టాత్మక బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation) ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ (BJP) కసరత్తు ప్రారంభించింది. మహాయుతి కూటమిలో భాగంగా 140 నుంచి 150 సీట్లలో పోటీ చేయాలని కమలనాథుల ఆలోచనగా ఉంది. బీజేపీ భాగస్వామ్య పార్టీ అయిన ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 70 నుంచి 80 సీట్లలో పోటీ చేసే అవకాశాలున్నాయి.
శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్)తో కూడిన ‘మహా వికాస్ అఘాడి’ (MVA)లో అంతర్గత విభేదాలున్నాయని, దీనిని అవకాశంగా మలుచుకుని ఎంవీఏకు సంప్రదాయంగా పట్టున్న ప్రాంతాల్లో పాగా వేయాలని బీజేపీ ఆలోచనగా ఉంది. ఇందుకు అనుగుణంగా బూత్ మేనేజిమెంట్, ఓటర్లను నేరుగా కలుసుకోవడం, స్థానిక సమస్యలపై ముంబై బీజేపీ యూనిట్ దృష్టి సారించింది. కూటమి భాగస్వామ్య నేతలు ఐకమత్యంగా ఉండాలని, ఎలాంటి ప్రకటనలు చేయకుండా సంయమనం పాటించాలని, అంతర్గత విభేదాలకు తావీయరాదని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మహాయుతి కూటమి నేతలకు విజ్ఞప్తి చేశారు.
బీఎంసీ ఎన్నికలు ఇటు మహాయుతి కూటమితో పాటు ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాడికి కూడా కీలకమే. ముంబై మున్సిపల్ పవర్ డైనమిక్స్ ప్రభావం 2029లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైన కూడా ఉంటుందని పరిశీలకుల అభిప్రాయంగా ఉంది. బీఎంసీ ఎన్నికల్లో ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే పొత్తు పెట్టుకుంటారనే బలమైన అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో బీజేపీ సైతం ఒంటరిగా పోటీకి వెళ్లాలని అనుకోవడం లేదు. హిందుత్వ ఓట్లు, ప్రభుత్వ అనుకూల ఓట్లు చీలకుండా మహాయుతి భాగస్వామ్య పార్టీలతోనే కలిసి వెళ్లాలని భావిస్తోంది. వేర్వేరుగా పోటీ చేస్తే ఎంవీఏకు, ముఖ్యంగా మరాఠీల ప్రభావం ఎక్కువగా కనిపించే రాజ్ థాకరే ఎంఎన్ఎస్కు లబ్ధి చేకూరే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
మరాఠీల ఓట్లు, మైనారిటీ కమ్యూనిటీ ఓట్లను ఠాక్రే కూటమి ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని, బీజేపీ ప్రధాన ఓటు బ్యాంకుగా అగ్రవర్ణాల వాణిజ్య వర్గాలు, నార్త్ ఇండియన్లు, గుజరాజతీలు ఉన్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యత, సమన్వయంతో బీఎంసీ ఎన్నికల్లో మహాయుతి సత్తా చాటాలని బీజేపీ వ్యూహరచనగా ఉంది.
వైద్యురాలి ఆత్మహత్యపై న్యాయం జరిగే వరకు విశ్రమించబోం – సీఎం
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వైద్యురాలి ఆత్మహత్య ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) స్పందించారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు తాను విశ్రమించబోనన్నారు. సతారాలోని ఫాల్టాన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తనను రాకుండా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. మాజీ ఎంపీ రంజిత్ సిన్హ్ నాయక్ నింబాల్కర్, ఎమ్మెల్యే సచిన్ పాటిల్ పేర్లు ఈ కేసుతో ముడిపడి ఉన్నాయన్న ఆయన.. వైద్యురాలి మృతి కేసును రాజకీయం చేసే ప్రయత్నాలను సహించబోనన్నారు. మరోవైపు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఈ కేసుపై తీవ్రంగానే స్పందించారు. వైద్యురాలి ఆత్మహత్యను ‘సంస్థాగత హత్య’గా అభివర్ణించారు. భాజాపా సారథ్యంలోని ప్రభుత్వ అమానవీయతను ఈ ఘటన బయటపెడుతోందని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో బాధితురాలిని తన సోదరిగా పేర్కొన్న సీఎం దేవేంద్ర ఫడణవీస్.. ఆమె ఆత్మహత్య విషాదకరం, దురదృష్టకరమన్నారు. ఆమెకు న్యాయం జరిగేలా చూడటంలో రాజీపడేది లేదని పునరుద్ఘాటించారు. బాధితురాలు తన సూసైడ్ నోట్లో పేర్కొన్న ఇద్దరు వ్యక్తులనూ అరెస్టు చేసినట్లు చెప్పారు. బీడ్‌కు చెందిన వైద్యురాలు గురువారం రాత్రి ఫాల్టాన్ పట్టణంలోని ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె రాసిన సూసైడ్ లేఖలో ఎస్సై గోపాల్ బదానే తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ప్రశాంత్ బన్కర్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మానసికంగా వేధించాడని పేర్కొన్నారు. దీంతో వీరిద్దరినీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు వైద్యురాలు పలుమార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని ఆమె తరఫు బందువు ఒకరు తెలిపారు. బాధితురాలు పనిచేస్తున్న సబ్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రిలో మెడికల్ రిపోర్టులను మార్చాలంటూ ఒత్తిడి చేశారని మరో బంధువు ఆరోపించారు. మరోవైపు, భాజపా మాజీ ఎంపీ రంజిత్‌సింగ్ నాయక్ నింబాల్కర్ గతంలో ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారని శివసేన యూబీటీ నేత అంబాదాస్ దాన్వే ఆరోపించారు. అయితే, దీనిపై స్పందించిన నింబాల్కర్.. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. కావాలనే ఈ కేసులోకి తన పేరును లాగుతున్నారన్నారు.
Also Read: ఐదేళ్లూ సిద్ధరామయ్యే సీఎం – యతీంద్ర
