నో ఆధార్‌ నో శాలరీ – ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ ఆదేశాలు

dc-Cover-rsobljbq8apupb7ip6vlr68bn7-20160912005642.Medi

Aadhar Card: ఆధార్‌ (Aadhaar) సంఖ్యను తెలపని ఉద్యోగులకు ఈ నెల జీతం ఆపేయాలని రాష్ట్ర ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులందరి పేర్లు, హోదా, ఆధార్, సెల్‌ఫోన్‌ నంబర్ల వివరాలు ఈ నెల 10వ తేదీకల్లా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని గత నెలలోనే ఈ శాఖ ఉత్తర్వులిచ్చింది. అయినా పలు శాఖల నుంచి స్పందన లేకపోవడంతో గడువును 17కి, ఆ తరువాత శనివారం (25) వరకూ రెండుసార్లు పొడిగించింది.

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలను ‘సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ’ (ఐఎఫ్‌ఎంఐఎస్‌)లో తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేస్తేనే జీతాలు విడుదల చేయాలని ఆర్థికశాఖ గత నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ బాధ్యత ఆయా కార్యాలయాల్లో జీతాల డ్రాయింగ్‌ అధికారులదేనని హెచ్చరించింది. కానీ సరైన స్పందన లేకపోవడంతో వివరాలు ఇవ్వని వారికి ఈ నెల జీతం ఆపేయాలని తాజాగా ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని ఉద్యోగుల్లో శాశ్వత(పర్మనెంట్‌) కేటగిరీలో 5.21 లక్షల మంది, తాత్కాలిక కేటగిరీలో 4.93 లక్షల మంది పనిచేస్తున్నారు.

కొన్ని శాఖల్లో నిర్లక్ష్యం దారుణంగా ఉంది. వాటిలో ఒక్కరి వివరాలు కూడా నిర్దేశిత గడువులోగా ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఉద్యోగుల సమగ్ర వివరాలు లేకపోవడంతో కొన్నిచోట్ల అక్రమంగా జీతాలు డ్రా చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులందుతున్నాయి. కొన్ని కార్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగులు మానేసినా వారి పేరుతో వేతనాలు డ్రా చేస్తున్నారని, మరికొందరు అనధికారికంగా సుదీర్ఘ సెలవులో వెళ్లినా జీతాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారాలు బయటపడతాయనే భయంతోనే చాలామంది వివరాలివ్వడంలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పేరు, మొబైల్‌ నంబర్, ఆధార్‌ నంబర్‌తో పోల్చి చూస్తే అసలు ఏ ఉద్యోగి ఏ శాఖలో ఉన్నారనే స్పష్టమైన వివరాలు అందుతాయని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ‘ఈనాడు’కు చెప్పారు. ఉద్యోగుల సమగ్ర వివరాలు ప్రభుత్వానికి చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి నెలా 10వ తేదీలోగా ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ప్రతి ఉద్యోగి వివరాలను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాలని చెప్పినా చేయడం లేదని ఆయన తెలిపారు.

Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్పాలి – కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *