పాన్ ఇండియా ఎస్ఐఆర్‌ కు ఈసీ సన్నాహాలు

Andhragazette- Election Commission

Andhragazette- Election Commission

Election Commission: బిహార్‌ తరహాలోనే దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(Special Intensive Revision) కు భారత ఎన్నికల సంఘం (Election Commission of India) సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం 4.15 గంటలకు ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తోంది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలతో సహా 10 నుంచి 15 రాష్ట్రాల్లో తొలి విడత ఎస్ఐఆర్ నిర్వహించే తేదీలను ఈసీ ఈ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉంది.

తొలి విడత ఎస్ఐఆర్ ఈ రాష్ట్రాల్లో

ఈసీ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో సాధ్యమైనంత త్వరగా ఎస్ఐఆర్‌ను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరిలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున తొలి విడత ఎస్ఐఆర్‌లో ఆ రాష్ట్రాలు చోటుచేసుకోనున్నాయి. అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న, జరగడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల అధికారులు తలమునకలై ఉంటారు కావున వాటి జోలికి వెళ్లరాదని భావిస్తోంది.

బిహార్‌లో ఇటీవలే ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ పూర్తి చేసి ఓటర్ల జాబితాను ప్రచురించింది. సెప్టెంబర్ 30వ తేదీ నాటికి తుది జాబితాలో 7.42 కోట్ల ఓటర్లు చోటుచేసుకున్నారు. నవంబర్ 6,11 తేదీల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.

‘ఎస్‌ఐఆర్‌’ కార్యక్రమానికి రాష్ట్రాల సీఈవోలు సన్నద్ధం కావాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. దిల్లీలో నిర్వహించిన సీఈవోల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ ఈ మేరకు సూచనలు జారీ చేశారు. ‘ఎస్‌ఐఆర్‌’పై అనుమానాలను నివృత్తి చేశారు. అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో పరిస్థితులను తెలుసుకున్నారు. దేశంలోని చాలావరకు రాష్ట్రాలు 2002-04 మధ్యకాలంలో ఓటరు జాబితాల సమగ్ర సవరణ చేపట్టాయి.

నకిలీ ఓటర్లను తొలగించడంతోపాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు ప్రారంభించినట్లు ఈసీ చెబుతోంది. బిహార్‌లో ఎన్నికలకు ముందు ఈ ప్రక్రియ నిర్వహించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే.. బిహార్‌లో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలని సూచించింది.

Also Read: తమిళనాడులో ‘ఎస్‌ఐఆర్‌’పై సీఎం ఫైర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *