శబరిమల బంగారం కేసు వెనుక భారీ కుట్ర – కేరళ హైకోర్టు
శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువు వ్యత్యాసం కేసులో ఏదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు కేరళ హైకోర్టు సూచించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ పొట్టి వెనుక భారీ శక్తులే ఉన్నాయనే అనుమానం వ్యక్తంచేసింది. దర్యాప్తును వేగవంతం చేయాలని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి.జయకుమార్‌ల ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన తాత్కాలిక నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు మంగళవారం సిట్ సమర్పించింది.
మరోవైపు దర్యాప్తు గోప్యతను కాపాడేందుకు సుమోటోగా కొత్త పిటిషన్‌ను నమోదుచేయాలని హైకోర్టు నిర్ణయించింది. ప్రస్తుత పిటిషన్‌లోని ఉన్నికృష్ణన్ పొట్టి, స్మార్ట్ క్రియేషన్స్ సంస్థలను మినహాయించి, బదులుగా ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, పోలీసులను దీనిలో చేర్చాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ‘‘బంగారం దొంగతనం జరిగిన సమయంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు, కమిషనర్ తీసుకున్న చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఉన్నికృష్ణన్ పొట్టి, దేవస్థానం బోర్డు అధ్యక్షుడికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని తేలిగ్గా తీసుకోలేం. దేవస్థానం మాన్యువల్ ఉల్లంఘనలపై పలు సందేహలున్నాయి. సుమారు 500 గ్రాముల బంగారం ఎక్కడికి వెళ్లిందో దేవస్థానం అధికారులకు తెలిసుండొచ్చు’’ అని ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. కుట్రలను పూర్తిగా పరిశీలించాలని సిట్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఉన్నికృష్ణన్ పొట్టి ఉద్దేశాలు సరైనవి కాదని, సంబంధిత పత్రాలన్నింటినీ పరిశీలించి తుది నివేదిక సమర్పించాలని సిట్‌కు సూచించింది.
