కానిస్టేబుల్ హత్యకేసు నిందితుడు రియాజ్ అరెస్ట్
తెలంగాణాలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్యకేసులో ప్రధాన నిందితుడు, పాత నేరస్థుడు రియాజ్‌ను ప్రాణాలతో పట్టుకున్నామని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు. నిందితుడిపై ఎలాంటి కాల్పులు జరపలేదని, నిజామబాద్‌లో ఎలాంటి ఎన్కౌంటర్ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి పాత నేరస్థుడు రియాజ్‌ను తీసుకొస్తున్న క్రమంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
దీనితో పోలీసులు రెండు రోజులుగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆరో ఠాణా పరిధిలోని సారంగాపూర్ శివారు ప్రాంతంలోని ఓ షెడ్డులో రియాజ్ తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అటుగా వెళ్లిన పోలీసులను చూసి రియాజ్ పారిపోయే ప్రయత్నం చేయగా.. ఆసిఫ్ అనే వ్యక్తి అతన్ని పట్టుకోవడానికి యత్నించాడు. దీంతో రియాజ్ కత్తితో ఆ వ్యక్తిపై దాడి చేశాడు. వెంటనే పోలీసులు రియాజ్‌ను చుట్టిముట్టి అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన నిందితుడిని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా… కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. నిందితుడు రియాజ్ అరబ్ ను ఎన్కౌంటర్ చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. సారంగపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు అతన్ని ఎన్ కౌంటర్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఎన్కౌంటర్ ఘటనపై నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రచారం జరుగుతున్నట్లుగా నిందితుడు రియాజ్‌పై ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడని తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తుండగా పట్టుపడ్డాడని, అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఓ వ్యక్తితో జరిగిన ఘర్షణలో రియాజ్‌కు గాయాలయ్యాయని సీపీ పేర్కొన్నారు. రియాజ్‌కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, అతని ప్రాణాలతోనే ఉన్నారని తేల్చి చెప్పారు.
రియాజ్ ఎక్కడ దొరికాడంటే
నిజామాబాద్ లోని సారంగపూర్ సమీపంలో ఎప్పుడో రోడ్డు ప్రమాదానికి గురై నిరుపయోగంలో ఉన్న ఒక లారీలో నిందితుడు రియాజ్ దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. శనివారం రాత్రి నుంచి 9 బృందాలతో పోలీసులు రియాజ్ కోసం గాలించారు. ఎట్టకేలకు రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు తప్పించుకునే క్రమంలో రియాజ్, మరో యువకుడికి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రియాజ్ కు గాయాలైనట్లు సమాచారం.
