మోతుగూడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం! ముగ్గురి మృతి !
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ద్విచక్రవాహనాన్ని కారు అతి వేగంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను కాగజ్ నగర్ మండలం వంజిరి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
మృతుల్లో జగన్ (27), డోంగ్రి అనసూయ(32), డోంగ్రి ప్రజ్ఞాశీల్(4) ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. అక్క అనసూయ, మేనల్లుడు ప్రజ్ఞాశీల్ తో కలిసి జగన్ బైక్ పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే, ఈ ప్రమాదంలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బాధితుడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక, వంజిరి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీపావళి వేళ ఒకే కుటుంబానికి, గ్రామానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్థులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
