వైట్ హౌస్ లో ట్రంప్, జెలెన్ స్కీ మధ్య మళ్లీ మాటల యుద్ధం
అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ లో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి చేదు అనుభవం ఎదురైంది. పుతిన్ ప్రతిపాదించినట్లు దొనెట్స్క్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించి యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీపై ట్రంప్ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. బహిరంగ వేదికలపై కీవ్‌కు తోమహాక్ క్షిపణులు ఇచ్చి పుతిన్‌ను ఇబ్బందిపెడతానని చెప్పిన ట్రంప్… తనతో సమావేశ సమయంలో పుతిన్‌కు అనుకూలంగా మాట్లాడటంతో అవాక్కవడం ఉక్రెయిన్ అధినేత వంతైంది. ఈ డీల్‌కు అంగీకరించకపోతే రష్యా అధినేత ఉక్రెయిన్ను సర్వనాశనం చేస్తాడని ట్రంప్ బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలోని రహస్య వివరాలను ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక కథనంలో పేర్కొంది.
ట్రంప్-జెలెన్స్కీ మధ్య చర్చ వాడీవేడిగా జరిగినట్లు పేర్కొంది. ఒక దశలో ఇద్దరు నాయకులు స్వరాలు పెంచుకొని మాట్లాడుకొన్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం వెల్లడించింది. ఆ సమయంలో యుద్ధ భూమిలో పరిస్థితి తెలియజేస్తూ ఉక్రెయిన్ బృందం ఇచ్చిన మ్యాప్‌లను ట్రంప్ పక్కన పేట్టేసి డాన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలని ఒత్తిడి చేసినట్లు వెల్లడించింది. పుతిన్ తలుచుకుంటే మిమ్మల్ని నాశనం చేస్తాడని ఒక దశలో ట్రంప్ హెచ్చరించారు. రష్యా ఆర్థికవ్యవస్థ చాలా బలంగా ఉందని ఆయన జెలెన్స్కీకి చెప్పారు. అటు శ్వేత సౌధం.. ఇటు జెలెన్స్కీ బృందం ఈ కథనంపై స్పందించలేదు.
జెలెన్స్కీతో భేటీకి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (United States President Donald Trump), రష్యా అధినేత పుతిన్ (Russian President Vladimir Putin) మధ్య సుదీర్ఘ ఫోన్‌కాల్ సంభాషణలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు శ్వేతసౌధం అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది. దొనెట్స్క్ ప్రాంతాన్ని మాస్కో సేనలు స్వాధీనం చేసుకోవడానికి దాదాపు 11 ఏళ్ల నుంచి వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. తాజాగా దీనిని తమకు అప్పగించి తీరాల్సిందేనని పుతిన్ పట్టుపడుతుండటంతో యుద్ధం కొనసాగుతోంది.
ఈ ఏడాది మార్చిలో అమెరికా-ఉక్రెయిన్ ఖనిజాల ఒప్పందం సమయంలో ట్రంప్-జెలెన్స్కీ మధ్య మీడియా సాక్షిగా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం చోటు చేసుకొంది. దీంతో అర్ధంతరంగా నాడు భేటీ, విందు రద్దయ్యాయి. నాడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా- ఉక్రెయిన్ల మధ్య అత్యవసరంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. శాంతి చర్చలకు జెలెన్స్కీ తిరిగి వచ్చినప్పటికీ అందుకు తాను సిద్ధంగా లేనన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇరువురు చల్లబడ్డారు. తిరిగి ఖనిజాల ఒప్పందం చేసుకొన్నారు. అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందడం మొదలైంది.
