వివాదం వేళ సీఎం, డిప్యూటీ సీఎంతో కిరణ్ మజుందార్ షా భేటీ
ఇటీవల బెంగళూరు నగర రహదారులు, చెత్తపై తీవ్ర విమర్శలు చేసిన బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా ప్రభుత్వ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. కిరణ్ మజుందార్ కు మద్దతుగా పారిశ్రామిక వేత్త హర్ష్ గొయెంకా.. సమస్యకు పరిష్కారం వెతకకుండా.. రాజకీయాలా? అంటూ నేతలపై మండిపడ్డారు. దీనితో కిరణ్ మజుందార్ ను ఉద్దేశ్యించి… సీఎం సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమదైన శైలిలో వ్యంగాస్ట్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కిరణ్ మజుందార్ షా మంగళవారం కలవడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరినీ వేర్వేరుగా కలిసిన ఆమె తన మేనల్లుడి వివాహానికి ఆహ్వానించారు. దీనితోపాటు బెంగళూరు నగరాభివృద్ధి, బ్రాండ్ బెంగళూరు ప్రాజెక్టులపై చర్చించారు. నగర సదుపాయాల మెరుగుదల కోసం తనవంతు సహకారం అందిస్తానని ఆమె హామీనిచ్చారు.
ఈ రోడ్లపై వివాదం నేపథ్యంలో డీకేతో బయోకాన్ ఛైర్మన్ భేటీ కావడం విశేషం. సమావేశంలో నగర మౌలిక సదుపాయాలపై ఆమె చేసిన విమర్శలపై చర్చ జరిగినట్లు సమాచారం. శివకుమార్ ఆమెకు సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ‘‘ఈ రోజు తన నివాసంలో బయోకాన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్ మజుందార్-షాను కలవడం ఆనందంగా ఉందంటూ డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. బెంగళూరులో అభివృద్ధి, ఆవిష్కరణలు, రాష్ట్ర ప్రగతి దిశలో ముందుకు సాగే మార్గం గురించి తాము చర్చ జరిపాం’’ అంటూ ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ఓ విదేశీ విజిటర్… బెంగళూరు నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానంటూ ఆమె ఓ పోస్టులో వెల్లడించారు. దీంతో ఆ పోస్టుపై బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా విమర్శలు చేశారు. డీకే శివకుమార్ రోడ్లపై పెడుతున్న పోస్టులపై కౌంటరిస్తూ.. కాస్త ఘాటుగా బదులిచ్చారు. మజుందార్ షా రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయవచ్చంటూ పేర్కొన్నారు. ఆమె వచ్చి అడిగితే.. ఆ గుంతలు పూడ్చేందుకు రోడ్లను కేటాయిస్తామన్నారు.
