విజృంభించిన రిషాద్ ! బోణీ కొట్టిన బంగ్లా !
లెగ్‌స్పిన్నర్ రిషాద్ హుస్సేన్ (6/35) విజృంభించడంతో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ ఘనంగా బోణీ కొట్టింది. తొలి వన్డేలో ఆ జట్టు 74 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. మొదట బంగ్లా 49.4 ఓవర్లలో 207 పరుగులకే పరిమితమైంది. తౌహిద్ హృదోయ్ (51) టాప్ స్కోరర్. మహిదుల్ ఇస్లాం (46), నజ్ముల్ శాంటో (32), రిషాద్ హుస్సేన్ (26) పర్వాలేదనిపించారు. జేడెన్ సీల్స్ (3/48), రోస్టన్ చేజ్ (2/30), జస్టిన్ గ్రీవ్స్ (2/32) ప్రత్యర్థిని కట్టడి చేశారు.
ఛేదనలో విండీస్ 51/0తో శుభారంభమే చేసింది. కానీ తర్వాత తడబడింది. రిషాద్ ధాటికి వరుస వికెట్లు కోల్పోయింది. 82 పరుగుల తేడా 10 వికెట్లు చేజార్చుకుని ఓటమి చవిచూసింది. విండీస్ 39 ఓవర్లలో 133 పరుగులకే కుప్పకూలింది. బ్రెండన్ కింగ్ (44), అలిక్ అథనేజ్ (27) పోరాటం సరిపోలేదు. రిషాద్‌తో పాటు ముస్తాఫిజుర్ రెహ్మాన్ (2/16), తన్వీర్ ఇస్లాం (1/46), మెహిది హసన్ మిరాజ్ (1/16) ప్రత్యర్థి పతనంలో కీలకపాత్ర పోషించారు.
