రెండో వన్డే తుది జట్టులోకి కుల్‌దీప్ యాదవ్
పెర్త్ వేదికగా ఆదివారం ఆసీస్, టీమ్‌ఇండియా మధ్య మొదటి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన గిల్ సేన నిర్ణీత 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ను టీమ్‌ఇండియా నిలువరించలేకపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమ్‌ఇండియా ఓటమితో ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సిరీస్‌లో నిలవాలంటే.. గురువారం అడిలైడ్‌లో జరగనున్న రెండో మ్యాచ్‌లో గిల్‌సేన తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తుది జట్టులో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత మైదానంలోకి దిగిన విరాట్ కోహ్లీ (Virat Kohli) (0), రోహిత్ శర్మ (Rohit Sharma) (8) మొదటి వన్డేలో విఫలమయ్యారు. అయినప్పటికీ వారు రెండో వన్డేలోనూ కొనసాగనున్నారు. కానీ బౌలింగ్ యూనిట్‌లో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. మొదటి మ్యాచ్‌లో అవకాశం దక్కని కుల్‌దీప్ యాదవ్‌ను (Kuldeep Yadav) రెండో వన్డేలో కచ్చితంగా ఆడించే అవకాశముంది. అతడు ఎవరి స్థానంలో తుదిజట్టులోకి వస్తాడనే ఆసక్తి నెలకొంది. వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసే అవకాశముంది. నితీశ్ కుమార్ రెడ్డిని తప్పించి కుల్‌దీప్‌ను జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొదటి వన్డేలో ఇటు బాల్‌తోనూ, అటు బ్యాట్‌తోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని హర్షిత్ రాణా స్థానం ప్రమాదంలో పడింది. రెండో మ్యాచ్ కోసం అతడి స్థానంలో ప్రసిద్ధ్‌కృష్ణను ఆడించే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ టీమ్‌ఇండియా వన్డే స్క్వాడ్‌లో ఉన్నా వారికి తుది జట్టులో అవకాశం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఎవరైనా గాయపడితే వీరు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే ఛాన్స్ ఉంది.
రెండో వన్డే కోసం భారత తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
