మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్య
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో సీఎం సిద్దరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. మా నాన్న, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బెళగావి జిల్లా రాయభాగ తాలూకా కప్పలగుడ్డిలో బుధవారం జరిగిన కనకదాస విగ్రహావిష్కణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా యతీంద్ర మాట్లాడుతూ… ‘మా నాన్న రాజకీయంగా చరమాంకంలో ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని అందిపుచ్చుకునే లక్షణాలు సీనియర్ మంత్రి సతీశ్ జార్ఖిహొళికి ఉన్నాయి. మా తండ్రిలా పార్టీ సిద్ధాంతాలు, రాజకీయ నిబద్ధతను పాటించే అలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం’ అని వ్యాఖ్యానించారు.
అయితే, యతీంద్ర కొంతసేపటికే యూటర్న్ తీసుకున్నారు. నాయకత్వ మార్పు ఊహాగానమే అంటూ కొట్టిపారేశారు. ఈ విషయంలో తమ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై స్పందించాలని రాయచూరులో పర్యటించిన ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను విలేకరులు అడగ్గా ‘ఈ ప్రశ్న యతీంద్రకే వేయాలి’ అని బదులిచ్చారు.
