భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్ సీరియస్
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో పవన్ మాట్లాడారు. జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు పవన్ సూచించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డి.ఎస్.పి. జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. భీమవరం డి.ఎస్.పి. పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయనీ, సివిల్ వివాదాలలో సదరు అధికారి జోక్యం చేసుకొంటున్నారనీ, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారనే తరహా ఫిర్యాదులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఈ అంశంపై ఉప ముఖమంత్రి పవన్ కల్యాణ్ ఫోన్ లో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించి డి.ఎస్.పి. వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని స్పష్టం చేశారు. అసాంఘిక వ్యవహారాలకు డి.ఎస్.పి. స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని, పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు. ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియచేయాలన్నారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలను పరిరక్షించాలని దిశానిర్దేశం చేశారు. భీమవరం డి.ఎస్.పి.పై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రికీ, రాష్ట్ర డీజీపీకి తెలియచేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.
