బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే చర్యలు తప్పవు – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్

WhatsApp Image 2025-10-21 at 18.59.06

విశాఖ నగరంలో గల వ్యాపారస్తులు, వాణిజ్య సముదాయాలలో తమ దుకాణాల ముందుడస్ట్ బిన్లు తప్పనిసరిగా ఉపయోగించాలని, లేనియెడల వారి వ్యాపార లైసెన్సులు రద్దు చేయడంతో పాటు తగిన జరిమానాలు చర్యలు చేపట్టడం జరుగుతుందని జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన జీవీఎంసీ 2 జోన్ లోని 11, 12, 13 వార్డుల పరిధిలోని ఆరిలోవ లోని బాలాజీ జంక్షన్, శాంతినగర్ కొండ ప్రాంతం, దుర్గా బజారులోని అన్నా క్యాంటీన్ పరిశీలన తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

ఈ పరిశీలనలో కమిషనర్ ముందుగా ఆరిలోవ, బాలాజీ నగర్ లో మాంసం దుకాణం, పూల వ్యాపారులు విక్రయిస్తున్న వీధి వ్యాపారులు వ్యర్ధాలను రోడ్లపై వేయడంతో కమీషనర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ వ్యర్ధాలను వారిచే స్వయంగా తొలగింప చేశారు. ఆరిలోవలోని టిఫిన్ సెంటర్ వద్ద డస్ట్ బిన్ లేకపోవడం గమనించి ఆ టిఫిన్ సెంటర్ యజమానికి 1000 రూపాయలు అపరాధ రుసుమును వసూలు చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. నగరంలో ప్రతి దుకాణం ముందు 3 డస్ట్ బిన్ లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు.
తదుపరి శాంతిపురం కొండ వాలు నివాస ప్రాంతాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడుతూ ఆ ప్రాంతాలకు నిత్యం చెత్త తరలించే వాహనాలు సమయానికి వస్తున్నాయా ? వ్యర్ధాలను విభజించి సిబ్బందికి అందిస్తున్నారా, లేదా అని స్థానికలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తాగునీరు ఏ సమయానికి వస్తుంది ఎంత సమయం ఇస్తున్నారని, తాగునీరు సంతృప్తికరంగా సరఫరా జరుగుతుందా, వీధిలైట్లు సమయానికి వెలుగుతున్నాయి లేదా అని అడిగి తెలుసుకున్నారు. నిత్యం నిర్ణీత సమయానికి తాగునీరు ప్రజలకు సరఫరా చేయాలని, వీధిలైట్లు నిత్యం వెలిగేలా చర్యలు చేపట్టాలని నీటి సరఫరా, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్లకు కమిషనర్ ఆదేశించారు.

నగరంలో గల వ్యాపారస్తులు, వాణిజ్య సముదాయాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు తప్పనిసరిగా తమ దుకాణాల ముందు డస్ట్ బిన్ లు ఏర్పాటు చేసుకోవాలని వ్యర్ధాలను డస్ట్ బిన్లలో వేసి రోజు జీవీఎంసీ వాహనాలకు అందించాలని ,అలా కాకుండా బహిరంగ ప్రదేశాలలోను, రోడ్ల పైన, కాలువలలో ,ఫుట్పాతులపై వ్యర్ధాలు వేస్తే వ్యాపారస్తులకు 1000 రూపాయలు, ఇతరులకు 500 రూపాయలు జరిమానా విధిస్తూ తగిన చర్యలు శానిటరీ ఇన్స్పెక్టర్లు చేపట్టాలని కమిషనర్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *