నిరుపేద విచారణ ఖైదీల బెయిలుకు పూచీకత్తుకు డబ్బు ప్రభుత్వాలే చెల్లించాలి
విచారణలో ఉన్న (అండర్ ట్రయల్) నిరుపేద ఖైదీల బెయిలు పూచీకత్తు సొమ్ము విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ డబ్బు చెల్లించాలని స్పష్టం చేసింది. నిరుడు ఫిబ్రవరి 13న జారీ చేసిన ‘ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌వోపీ)’ను ఈ మేరకు సవరించింది. ఈ వ్యవహారంలో అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, అమికస్ క్యూరీగా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా చేసిన సూచనలను ఆమోదిస్తూ జస్టిస్ ఎం.ఎం.సుంద్రేశ్, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మల ధర్మాసనం.. సవరించిన ఎస్‌వోపీని జారీ చేసింది.
తాజా నిబంధనల ప్రకారం- విచారణలో ఉన్న పేద ఖైదీలకు పూచీకత్తు డబ్బు చెల్లించే వ్యవహారంలో..
ప్రతి జిల్లాలో సాధికార కమిటీని ఏర్పాటు చేయాలి.
జిల్లా కలెక్టరు లేదా జిల్లా మేజిస్ట్రేటు నామినీ, డీఎల్‌ఎస్‌ఏ, ఎస్పీ, సంబంధిత జైలు సూపరింటెండెంట్/డిప్యూటీ సూపరింటెండెంట్, సంబంధిత జైలు ఇన్‌ఛార్జి జడ్జి ఇందులో సభ్యులుగా ఉంటారు.
డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ఈ కమిటీ సమావేశాలను నిర్వహిస్తారు.
బెయిలు మంజూరయ్యాక ఏడు రోజుల్లోపు అండర్ ట్రయల్ ఖైదీ విడుదల కాకపోతే.. జైలు అధికారులు డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శికి సమాచారం అందించాలి.
ఆ ఖైదీ పొదుపు ఖాతాలో డబ్బు లేకపోతే ఐదు రోజుల్లోగా కార్యదర్శి.. డీఎల్‌ఎస్‌ఏకు విన్నవించాలి.
అనంతరం ఐదు రోజుల్లోగా సాధికార కమిటీ పూచీకత్తు సొమ్మును (రూ.50 వేల వరకు అయితే) విడుదల చేయాలి.
పూచీకత్తు సొమ్ము రూ.50 వేలకు, రూ.లక్షకు మధ్య ఉంటే.. ఆయా కేసుల్లో కమిటీ తన విచక్షణను ఉపయోగించి నిధుల విడుదల నిర్ణయం తీసుకోవాలి. రూ.లక్ష కంటే ఎక్కువగా ఉంటే.. పూచీకత్తు మొత్తాన్ని తగ్గించాలని కోర్టుకు విజ్ఞప్తి చేయొచ్చు.
ఈ కమిటీ ప్రతి నెలా మొదటి, మూడో సోమవారం భేటీ అవ్వాలి.
