కేదారేశ్వర నోము ఎలా చేస్తారో తెలుసా ?

kedaresawara-vratam

ఆదిదంపతులు అంటే శివపార్వతులు. దీపావళి అమావాస్య రోజు లక్ష్మీపూజకు ఎంతటి ప్రాధాన్యం ఉందో అలాగే శివపార్వతుల ఆరాధనకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. తన శరీరంలోనే అర్థభాగాన్ని పార్వతికి ఇచ్చి అర్ధనారీశ్వరుడుగా పేరొందిన పార్వతి పరమేశ్వరుల అనుగ్రహాన్ని సులభంగా పొందడానికి ఆచరించే ఒక గొప్ప వ్రతం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

కేదారేశ్వర నోము

కేదారేశ్వర నోము ఆదిదంపతుల అనుగ్రహం కోసం భార్యాభర్తలు ఆచరించే వ్రతం. దీనినే కేదారగౌరి వ్రతమని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య సూర్యోదయంతో ఏ రోజు ఉంటుందో ఆ రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆశ్వయుజ అమావాస్య తిథి అక్టోబర్ 20, సోమవారం మధ్యాహ్నం నుంచి మొదలై మరుసటి రోజు అంటే అక్టోబర్ 21, మంగళవారం సాయంత్రం వరకు కొనసాగుతుంది. దీపావళి పండుగ అమావాస్య రాత్రి సమయంలో ఉన్నప్పుడు జరుపుకొంటాం కాబట్టి అక్టోబర్ 20న చేసుకోవాలని, సోమవారం దీపావళి పండుగగా జరుపుకుంటే, సూర్యోదయంతో అమావాస్య ఉన్న మరుసటి రోజైన మంగళవారం రోజు కేదార గౌరి వ్రతాన్ని జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. కేదార గౌరి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఆ వ్రత ఫలం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.

8 రోజుల వ్రతం

దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో కేదార గౌరి వ్రతాన్ని ఎక్కువగా ఆచరిస్తారు. ఈ వ్రతం దీపావళి సమయంలో చేసే లక్ష్మీపూజతో సమానంగా ఉంటుంది. ఈ కేదార వ్రతాన్ని ఆశ్వయుజ బహుళ అష్టమి నుంచి అమావాస్య వరకు 8 రోజుల పాటు ఆచరించి చివరి రోజైన ఆశ్వయుజ అమావాస్య నాడు పూజను ముగిస్తారు. కానీ, అధిక శాతం మంది కేదార గౌరీ వ్రతం ఒకే రోజు అంటే దీపావళి అమావాస్య రోజున నిర్వహిస్తుంటారు.

పూజా విధానం!

కేదార గౌరీ వ్రతాన్ని ఆచరించేవారు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలారా స్నానం చేసి, ఇల్లు వాకిళ్లు శుభ్రం చేసుకోవాలి. గంగా జలంతో పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పసుపు రాసిన పీటపై కుంకుమ బొట్లు పెట్టి, ఆ పీటపై బియ్యాన్ని రాశిగా పోయాలి. అనంతరం శివపార్వతుల చిత్రపటాన్ని కానీ విగ్రహాలను కానీ బియ్యంపై ప్రతిష్టించాలి. శివపార్వతుల చిత్రపటాన్ని గంధం, కుంకుమలతో అలంకరించాలి. పసుపు రంగు చేమంతులు, తెల్లని తుమ్మి పూలు, మరేడుదలలు, మందార పూలతో శివపార్వతుల పటాన్ని అలంకరించాలి.

కలశపూజ

కేదార గౌరీ వ్రతంలో కలశం పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముందుగా ఒక రాగి చెంబులో గంగాజలాన్ని నింపాలి. కలశాన్ని గంథం, కుంకుమలతో అలంకరించాలి. కలశంలో తుమ్మి పూలు, మందార పూలు, అక్షింతలు వేయాలి. ఇప్పుడు కలశంపై మామిడాకులు, కొబ్బరికాయ, జాకెట్ ముక్క ఉంచి, కలశాన్ని శివపార్వతుల చిత్రపటం ముందు ప్రతిష్టించాలి.

కలశంలోకి కేదారేశ్వరుని ఆవాహన

ముందుగా కలశంలోని జలాల్లోకి సమస్త నదీ జలాలను ఆవాహన చేయాలి. తరువాత భక్తిశ్రద్ధలతో కలశానికి నమస్కరిస్తూ, కలశంలోకి కేదారేశ్వరుని ఆవాహన చేయాలి. అంటే ఇప్పుడు ఈ కలశమే కేదారేశ్వరునిగా భావించి పూజించాలి. తరువాత అక్షింతలు, తుమ్మి పూలు, మారేడు దళాలు, ఎర్ర మందారాలు, చేమంతులతో కేదారేశ్వరునికి అష్టోత్తర శతనామ పూజ చేయాలి.

తోరం ఇలా సిద్ధం చేసుకోవాలి!

వ్రతమనగానే తోరం తప్పనిసరి కదా! అయితే కేదార గౌరీ వ్రతంలో తోరాన్ని తయారు చేసుకోడానికి కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. ఎర్రని పట్టుదారంతో, 21 పోగులతో, 21 ముడులతో తోరాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాన్ని శివపార్వతుల ముందు, కేదారేశ్వరుని స్వరూపంగా భావించే కలశం ముందు ఉంచి మంత్ర పూర్వకంగా తోర పూజ చేయాలి. తర్వాత ఈ తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. సాధారణంగా కేదారగౌరి వ్రతం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకునే వ్రతం కాబట్టి ఈ తోరాన్ని భార్యాభర్తలు ఇద్దరు కుడిచేతికి కట్టుకోవాలి.

అరిసెలు నివేదన!

తోర పూజ పూర్తయ్యాక గోధుమ పిండి, బెల్లంతో తయారైన 21 అరిసెలు కేదారేశ్వరునికి నివేదించాలి. వీటితో పాటు అన్ని కూరగాయలు కలిపి తయారు చేసే కదంబ ప్రసాదం, అరటిపండ్లు, కొబ్బరికాయ, పంచామృతాలు కూడా శివపార్వతులకు నివేదించాలి. తరువాత మంగళ హారతులు ఇవ్వాలి. చివరగా కేదార గౌరీ వ్రత కథను చదువుకుని శిరస్సున అక్షింతలు వేసుకోవాలి.

కేదార గౌరీ వ్రత ఫలం!

తొలుత ఈ కేదారగౌరి వ్రతాన్ని గురించి గౌతమ మహర్షి పార్వతీ దేవికి వివరించినట్లుగా తెలుస్తోంది. గౌతమ మహర్షి సూచన మేరకు పార్వతి దేవి ఈ వ్రతాన్ని స్వయంగా ఆచరించి పరమశివునిలో అర్థభాగాన్ని పొందినట్లుగా మనకు లింగ పురాణం ద్వారా తెలుస్తోంది. కేదారం అంటే మాగాణం. వరి పండే పొలం. కేదారానికి అధిపతి కేదారేశ్వరుడు. పార్వతీదేవి ప్రకృతి స్వరూపిణి. పార్వతి లేకపోతే శివుడు శక్తి హీనుడయిన గాథను ఈ వ్రత కథగా చెప్పుకుంటారు. ఈ వ్రత కథ స్త్రీ పురుష సమానత్వాన్ని తెలియచేస్తుంది. తన శరీరంలో అర్థభాగాన్ని పార్వతికి ఇచ్చిన శివుడు గౌరీదేవితో కలిసే అన్ని రకాల పూజలు అందుకుంటాడు. గౌరీదేవి లేనిదే శివుడు లేడు. శివుడు లేనిదే గౌరీదేవి లేదు. కేదారగౌరి వ్రతంలో గౌరిదేవితో కూడిన పరమేశ్వరుణ్ణి పూజించడం సంప్రదాయం. ఆశ్వయుజ అమావాస్య రోజు ఈ అరుదైన వ్రతాన్ని ఆచరిస్తే అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని శాస్త్ర వచనం. రానున్న దీపావళి అమావాస్య రోజు మనం కూడా కేదార గౌరి వ్రతాన్ని ఆచరిద్దాం. ఆదిదంపతుల అనుగ్రహంతో అన్యోన్య దాంపత్యాన్ని పొందుదాం.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ! వందే పార్వతీపరమేశ్వరో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *