కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను ఉపేక్షించం – హోం మంత్రి అనిత
దురదృష్టవశాత్తు జరిగిన ఘటనల్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలనుకునేవారు… దానిని ముందుకు తీసుకెళ్లలేరని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతిభద్రతలపై సీఎం సమీక్ష అనంతరం హోం మంత్రి మీడియాతో మాట్లాడారు. కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేసేందుకు, నిందితులను శిక్ష పడేందుకు కులం అవసరం లేదన్నారు. కందుకూరులో తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడుపై హత్య ఎంతో కిరాతకంగా జరిగిందని వెల్లడించారు. ఈ ఘటన.. ఆర్ధిక లావాదేవీల్లో భాగంగా జరిగిందే అన్నారు. స్నేహితుల మధ్య ప్రారంభమైన చిన్న పాటి గొడవ కక్షసాధింపుల వరకూ వెళ్లిందని తెలిపారు. హత్య జరిగిన వెంటనే పోలీసులు స్పందించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు సీఎం సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు.
లక్ష్మీనాయుడిని చాలా దారుణంగా హరిశ్చంద్రప్రసాద్ హత్య చేశారు. ఈ హత్య కేసు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు. అలాగే హత్య నిందితుల ఆస్తుల జప్తునకు సిఫార్సు చేశాం. లక్ష్మీనాయుడి కుటుంబసభ్యులను ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాం. లక్ష్మీనాయుడు సతీమణికి 2 ఎకరాలు, రూ.5 లక్షల పరిహారం, లక్ష్మీనాయుడు ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున ఇస్తాం, లక్ష్మీనాయుడి పిల్లల పేరిట రూ.5 లక్షల చొప్పున ఎఫ్‌డీ చేస్తాం. ఇదే ఘటనలో గాయపడిన పవన్, భార్గవ్‌కు పరిహారం ఇస్తాం. దాడిలో గాయపడిన పవన్‌కు 4 ఎకరాలు, రూ.5 లక్షల నగదు. భార్గవ్‌కు రూ.3 లక్షల నగదు పరిహారం అందిస్తాం. ఇలాంటి ఘటనలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదు అని హోంమంత్రి అనిత అన్నారు.
