కిరణ్‌ మజుందార్‌ షాకు హర్ష్‌ గొయెంకా మద్దతు

Harsh-Goenka

భారత సిలికాన్‌ వ్యాలీగా అభివర్ణించే బెంగళూరులో రోడ్ల దుస్థితిపై బయోకాన్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా ఇటీవల చేసిన పోస్టులు రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆమెపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. దీనిపై తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్‌ గొయెంకా స్పందిస్తూ కిరణ్‌ మజుందార్‌ షాకు మద్దతుగా నిలిచారు. సమస్యకు పరిష్కారం వెతకడం మాని.. రాజకీయాలు చేస్తున్నారంటూ నేతలను ఆయన దుయ్యబట్టారు.

‘‘మన రాజకీయ నాయకులు విమర్శలను తీసుకోకపోవడం దురదృష్టకరం. బెంగళూరులో క్షీణిస్తోన్న మౌలిక సదుపాయాల గురించి కిరణ్‌ మజుందార్‌ షా మాట్లాడారు. ఆ సమస్యను పరిష్కరించడం మాని నేతలు దానిపై రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వ అనుకూల పోస్టులు పెట్టాలని ఆమెను బలవంత పెడుతున్నారు. సమస్యపై కాకుండా విమర్శకులపై దాడి చేయడం సర్వసాధారణంగా మారిపోయింది’’ అని హర్ష్‌ గొయెంకా తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు.

గత కొంతకాలంగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయోకాన్‌ పార్క్‌కు వచ్చిన ఓ విదేశీ విజిటర్‌.. నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని కిరణ్‌ మజుందార్‌ షా ఓ పోస్టులో వెల్లడించారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వ్యంగ్యంగా బదులిచ్చారు. ఆమె రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయొచ్చంటూ అన్నారు. అందుకోసం నిధులు కూడా ఇస్తామన్నారు. వ్యక్తిగత అజెండాతోనే ఆమె ఈ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. భాజపా హయాంలో వారు ఎందుకు వీటిపై స్పందించలేదని ప్రశ్నించారు. ఈ పరిణామాలపైనే తాజాగా హర్ష్‌ గొయెంకా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *