ఏపీలోని వర్సిటీలతో కలిసి పనిచేయండి – ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

1200-675-25249756-thumbnail-16x9-minister-nara-lokesh-australia-tour-4th-day-updates

మంత్రి నారా లోకేశ్‌ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్) మార్నీ వాట్సన్‌తో గోల్డ్ కోస్ట్ క్యాంపస్‌లో ఆయన భేటీ అయ్యారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ కళాశాలలో అధునాతన క్రీడా సౌకర్యాలను పరిశీలించారు. పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం చొరవ చూపాలన్నారు. ఆంధ్రప్రదేశ్-గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏర్పాటు చేయాలని కోరారు. పరిశోధన, విద్యార్థుల మార్పిడి, అవగాహన సమన్వయానికి ఏపీలో హబ్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సిలబస్ రూపకల్పన, నైపుణ్య ధ్రువీకరణకు ఏపీ వర్సిటీలతో భాగస్వామ్యం వహించాలని కోరారు.

‘‘పునరుత్పాదక శక్తి, ప్రజారోగ్యం, నీటి నిర్వహణ రంగాల్లో సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు ప్రారంభించాలి. గ్రిఫిత్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ విద్యాసంస్థల మధ్య డ్యూయల్ డిగ్రీ లేదా ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయాలి. స్కాలర్‌షిప్‌లు, అధ్యాపకులు, విద్యార్థుల అభివృద్ధికి ఎక్స్చేంజి కార్యక్రమాలను ప్రోత్సహించాలి. నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలి. స్టార్టప్‌లకు మద్దతునిచ్చేలా ఆంధ్రప్రదేశ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో కలిసి పనిచేయాలి’’ అని లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. (Andhra Pradesh News)

సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్ఠ భద్రత – మంత్రి లోకేశ్‌

తుని రూరల్‌ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలుసుకొని షాక్‌కు గురయినట్లు విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారని వెల్లడించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారెవరైనా ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి, అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్ఠమైన భద్రత కల్పించాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి లోకేశ్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *