అమెరికాలో ట్రంప్ పై పెల్లుబికిన ప్రజాగ్రహం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రజాగ్రహం పెల్లుబికింది. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజానీకం ‘నో కింగ్స్’ అంటూ ఆందోళన బాట పెట్టింది. నో కింగ్స్ పేరిట దేశవ్యాప్తంగా శనివారం నిర్వహించిన నిరసనల్లో లక్షలాది ప్రజలు ట్రంప్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కి తమ నిరసనను తెలియజేశారు. వలసల నియంత్రణకు ట్రంప్ తీసుకుంటున్న చర్యలు, విశ్వవిద్యాలయాలకు నిధుల తగ్గింపు, దేశంలోని చాలా రాష్ట్రాల్లో సైనికుల మోహరింపు, షట్‌డౌన్‌తో ప్రభుత్వ సేవలు నిలిచిపోవడం వంటి అనేక కారణాలు ఈ నిరసనల వెనుక ఉన్నాయి. ట్రంప్ దేశ అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మూడో ఆందోళన ఇది.
మీడియా కథనాల ప్రకారం అమెరికాలోని 50 రాష్ట్రాల్లోని 2,700 ప్రాంతాల్లో నోకింగ్స్ నిరసన ప్రదర్శనలు జరిగాయి. దాదాపు 70 లక్షల మంది ప్రజలు ఈ నిరసనల్లో పాల్గొన్నారని అంచనా. న్యూయార్క్, వాషింగ్టన్, బోస్టన్, కాలిఫోర్నియా, షికాగో వంటి ప్రధాన నగరాలతోపాటు చిన్నచిన్న పట్టణాలు, కమ్యూనిటీల్లో కూడా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేశారు. బ్యాండు మేళాలు, విచిత్ర వేషధారణలతో నిరసనల్లో పాల్గొన్న ప్రజలు నిరంకుశత్వానికి, ఇమ్మిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. న్యూయార్క్ టైమ్ స్క్వేర్, బోస్టన్, కాలిఫోర్నియా, షికాగోల్లో జరిగిన నిరనస ప్రదర్శనల్లో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇలా ఉంటుంది. భయం లేదు, ద్వేషం లేదు. వలసదారులకు స్వాగతం అంటూ నినాదాలు చేశారు. లాస్‌ఏంజెలె్‌సలో జరిగిన నిరసనల్లో ఆందోళనకారులు వలసదారుల హక్కులకు ప్రాధాన్యం ఇచ్చారు. మెక్సికో, అమెరికా జెండాలను ప్రదర్శించారు. కెనడా, బెర్లిన్, రోమ్, పారిస్, స్వీడన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాల బయట కూడా నిరసనలు జరిగాయి. దేశవ్యాప్తంగా 2500కు పైగా నిరసన ప్రదర్శనలు జరిగాయని, శాంతియుతంగా జరిగిన ఈ ర్యాలీల్లో ఎవర్ని అరెస్టు చేయలేదని పోలీసులు ప్రకటించారు.
నేనే రాజు అనేలా ట్రంప్ ఏఐ వీడియోలు
నోకింగ్స్ అంటూ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్న ప్రజలను వెటకారం చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పలు ఏఐ వీడియోలు షేర్ చేశారు. అందులో ఓ వీడియోలో తలపై కిరీటంతో రాజు వేషధారణలో ఉన్న ట్రంప్.. కింగ్ ట్రంప్ అనే యుద్ధ విమానంలో వెళుతూ.. కింద తనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై బురద చల్లుతాడు. మరో వీడియోలో ట్రంప్ తలపై కిరీటం, రాజు వస్త్రాలు ధరించి కత్తితో అభివాదం చేయగా.. డెమొక్రటిక్ పార్టీ నేతలు అతనికి మోకరిల్లినట్టు ఉంటుంది. ఈ వీడియోను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా షేర్ చేశారు. కాగా, నోకింగ్స్ ఆందోళనలపై శుక్రవారం ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడిన ట్రంప్.. ‘‘ వాళ్లు నన్ను రాజు అని అంటున్నారు. కానీ నేను రాజుని కాదు’’ అని అన్నారు. ఇక, నోకింగ్స్ నిరసనలను అమెరికా వ్యతిరేక ఆందోళనలని రిపబ్లికన్ పార్టీ వర్గాలు విమర్శించాయి.
ఏమిటీ నో కింగ్స్ ?
డొనాల్డ్ ట్రంప్ రెండో సారి దేశ అధ్యక్షుడు అయ్యాక ఎలాన్ మస్క్ నేతృత్వంలో డోజ్‌ను ఏర్పాటు చేసి వేలాది మంది ఉద్యోగులపై ఓటు వేశారు. పౌరసత్వం, ట్రాన్స్‌జెండర్ల రక్షణ, అక్రమ వలసల అంశాల్లో కీలక మార్పులు చేశారు. ఈ క్రమంలో వలసదారులపై అధికారులు చేపట్టిన సోదాలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై స్థానికంగా ప్రజలు నిరసనలు తెలియజేయడం మొదలుపెట్టారు. ఆ నిరసనలను నియంత్రించేందుకు ప్రభుత్వం జాతీయ బలగాలను రంగంలోకి దించింది. దీంతో ట్రంప్ విధానాలు నిరంకుశంగా ఉన్నాయని, అమెరికాలో రాచరికం లేదని చెప్పేలా ‘నో కింగ్స్’ అంటూ ట్రంప్ వ్యతిరేకులు ఆందోళనలు మొదలుపెట్టారు. ఇటీవల షట్‌డౌన్‌తో అనేక ప్రభుత్వ సేవలు నిలిచిపోవడంతో నోకింగ్స్ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.
