అంతర్జాతీయ కార్యక్రమాలకు విశాఖ నగరాన్ని సుందరీకరించండి – మేయర్ పీలా శ్రీనివాసరావు
విశాఖ నగరంలో పారిశుధ్య పనులను మెరుగుపరచాలని , విశాఖ నగర వేదికగా జరుగబోవు అంతర్జాతీయ కార్యక్రమాలకు నగరాన్ని సుందరకరించాలని , పారిశుద్ధ్య కార్మికుల విధులను వారి హాజరును పరిశీలించి నిర్ణీత కాలంలో వారి వేతనాలను చెల్లించాలని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జీవీఎంసీ జోనల్ కమిషనర్లు, ప్రధాన వైద్యాధికారి, సహాయ వైద్యాధికారులతో సమీక్ష సమావేశం ప్రధాన కార్యాలయంలో గల తన చాంబర్లో నిర్వహించారు.
ఈ సమావేశంలో మేయర్ మాట్లాడుతూ విశాఖ వేదికగా అంతర్జాతీయ కార్యక్రమాలు నగరంలో త్వరలో జరుగనున్నందున విశాఖ నగరాన్ని మరింత సుందరీకరిస్తూ, పారిశుద్ధ్య పనులను మెరుగుపరచాలని , అలాగే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను నిర్ణీత కాలంలో చెల్లించేందుకు జోనల్ కమిషనర్లు, ప్రజారోగ్య అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ముఖ్యంగా బీచ్ రోడ్లో పారిశుద్ధ్య పనులను మరింత మెరుగుపరచాలని ,అందుకు తగినంత కార్మికులను ఏర్పాటు చేయాలని, ఇటీవల తన పర్యటనలో బీచ్ తీర ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు తక్కువ మంది విధులు నిర్వహించడం గమనించానని అన్నారు. పారిశుధ్య కార్మికులు ఎక్కువగా విధులకు గైర్హాజరైనట్లయితే అటువంటి వారిని గుర్తించి వారిపై చర్యలు చేపట్టాలని , అలాగే సుదీర్ఘకాలం నుండి విధులకు గైర్హాజరవుతున్న పారిశుద్ధ్య కార్మికుల జాబితాను సిద్ధం చేయాలని, మరణించిన, పదవీ విరమణ పొందిన పారిశుద్ధ్య కార్మికుల స్థానాలలో కొత్తవారిని తీసుకునేందుకు కావలసిన చర్యలను, ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రధాన వైద్యాధికారికి , జోనల్ కమిషనర్లకు మేయర్ ఆదేశించారు. అలాగే నగరంలో ఎక్కువ ఏ ఏ చోట్ల పారిశుద్ధ్య పనులు అవసరమో గుర్తించి అక్కడ పారిశుద్ధ్య పనుల మెరుగకు అవసరమగు వర్కర్లను సర్దుబాటు చేయాలని అన్నారు. ఇకపై వార్డుల్లో నిత్యం పర్యటిస్తానని పారిశుద్ధ్య పనితీరులో ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లకు ,సహాయక వైద్యాధికారులకు మేయరు తెలిపారు. బీచ్ లో సందర్శకులు ,విహారయాత్రికులు ఎక్కువగా సందర్శిస్తున్నందున వారికి కల్పించవలసిన మౌలిక సదుపాయాలలో భాగంగా స్నానపు గదులను, పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని ,ఇప్పుడు ఉన్న టాయిలెట్లకు అదనంగా ఆర్కే బీచ్ నుండి అప్పుగర్ వరకు అవసరమైన చోట టాయిలైట్లు, స్నానపు గదుల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. బీచ్ లో కలుస్తున్న ప్రధాన కాలువల పరిశుభ్రతకు అవసరమగు చర్యలు చేపట్టాలని మేయర్ జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అందరు జోనల్ కమిషనర్లు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్, అందరు సహాయక వైద్యాధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.
