నా కుటుంబమే లక్ష్యంగా క్రిమినల్‌ కేసులు – మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ

Justice NV Ramana

Justice NV Ramana

Justice N. V. Ramana: గత వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ (N. V. Ramana) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం అమరావతిలోని విట్‌ ఏపీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఐదో స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్.వి.రమణ… అమరావతి ఉద్యమం, అక్రమ కేసుల బనాయింపు విషయంలో గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడుతూ…‘నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని క్రిమినల్‌ కేసులు పెట్టారు. నాపై ఒత్తిడి తీసుకురావడానికే అలా చేశారని మీ అందరికీ తెలుసు. నన్నే కాదు… రైతుల పక్షాన మాట్లాడిన వారందరినీ భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రాజ్యాంగ విలువలు కాపాడిన న్యాయమూర్తులకు బదిలీలు, ఒత్తిళ్లు, వేధింపులు ఎదురయ్యాయి. వారి కుటుంబాలను రాజకీయ కుట్రలకు బలి చేశారు. అలాంటి క్లిష్ట సందర్భాల్లోనూ న్యాయమూర్తులు, న్యాయవాదులు రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేశారు. బాధ్యతగా పనిచేయడమూ కొన్నిసార్లు వ్యక్తిగతమైన బాధగా మిగిలిపోతుంది’ అని అన్నారు.

అమరావతి రైతుల ధైర్యానికి సెల్యూట్‌

Justice N. V. Ramana: ‘చాలామంది రాజకీయ నాయకులు మౌనంగా ఉన్న సమయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు రాజ్యాంగానికి అండగా నిలబడ్డారు. మన చరిత్ర, సంస్కృతికి నిలువుటద్దం, నవ్యాంధ్రప్రదేశ్‌ ఆకాంక్షలకు ప్రతీక అమరావతి. దానిని రాజధానిగా నిలబెట్టుకోవడానికి ఈ ప్రాంత రైతులు ఐదేళ్లపాటు ఎన్నో కష్టాలు పడ్డారు. అణచివేతకు గురయ్యారు. అయినా వారు ధైర్యంగా, శాంతియుతంగా సాగించిన పోరాటం అజరామరం. స్వాతంత్య్ర పోరాటం తర్వాత దక్షిణ భారతదేశంలో జరిగిన సుదీర్ఘ పోరాటమిది. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఒత్తిళ్లు వచ్చినా వెనుకడుగు వేయని అమరావతి రైతుల ధైర్యానికి సెల్యూట్‌. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచినందుకు వారికి కృతజ్ఞతలు’ అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. ‘ఈ గడ్డ నాకెన్నో పాఠాలు నేర్పింది. దేశంలో అత్యయిక పరిస్థితి విధించినప్పుడు కృష్ణా నది దీవుల్లో రహస్యంగా సమావేశమయ్యేవాళ్లం’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

అధికారం మారితే విధానాలు మార్చడం తప్పు – జస్టిస్‌ రమణ

Justice N. V. Ramana on YSRCP: ‘ప్రభుత్వం మారినప్పుడు పాత విధానాలను రద్దు చేయడం సరికాదు. అలా చేస్తే అభివృద్ధి ఆగిపోవడంతో పాటు ప్రజలు ఇబ్బందులు పడతారనడానికి అమరావతి అనుభవమే సాక్ష్యం. అధికార వ్యవస్థను ప్రతీకార రాజకీయాలకు వాడకూడదని నేను ఒక తీర్పులో చెప్పాను. ప్రభుత్వాలు మారినా న్యాయస్థానాలు, చట్టపరిపాలన దేశానికి స్థిరమైన ఆధారం. అందువల్ల ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచాలి’ అని జస్టిస్‌ రమణ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో విట్‌ వంటి సంస్థలు గత ఐదేళ్లలో ఇలాంటి ఎన్నో సవాళ్లు ఎదుర్కొని నిలబడ్డాయన్నారు.

ప్రపంచాన్ని కృత్రిమ మేధస్సు, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ప్రభావితం చేస్తున్నాయని, నేటి సమాచారయుగంలో కచ్చితమైన సమాచారం పొందడం కష్టమైందని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చినా మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వార్తల వక్రీకరణ, రాజకీయ పార్టీలకు అనుకూలంగా పని చేసే మీడియా వల్ల ప్రజాస్వామ్యానికి హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్ఫింగ్‌ వీడియోలు, డీప్‌ఫేక్‌ బాధితులకు సాయం చేసే సమర్థమైన న్యాయ యంత్రాంగం లేదన్నారు. యువత వీలైనన్ని భాషలు నేర్చుకోవాలని.. అయితే, మాతృభాషను మరిచిపోవద్దని సూచించారు.

సవాళ్లకు ఎదురునిలవాలి – రాజీవ్‌వర్మ

Justice N. V. Ramana: గౌరవ అతిథిగా హాజరైన బెంగళూరుకు చెందిన శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ రాజీవ్‌వర్మ మాట్లాడుతూ విద్యార్థులు సవాళ్లు, సమస్యలు ఎదురైనా వాటిని విజయాలకు బాటలుగా వేసుకుని ఎదగాలన్నారు. విద్యార్థులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని విట్‌ విద్యాసంస్థల వ్యవస్థాపకులు, ఛాన్సలర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ సూచించారు. కార్యక్రమంలో విట్‌ ఉపాధ్యక్షులు శంకర్‌ విశ్వనాథన్, డాక్టర్‌ జి.వి.సెల్వం, వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఎస్‌.వి.కోటారెడ్డి, రిజిస్ట్రార్‌ జగదీష్‌చంద్ర ముదిగంటి తదితరులు పాల్గొన్నారు.

Also Read: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *